బాబోయ్.. బాబూమోహన్!
posted on Aug 26, 2024 @ 12:03PM
మొన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించనంత వరకు తెలంగాణలో చాలామంది ‘ప్రముఖ నాయకులు’ చాలామంది తెలుగుదేశం పార్టీని చిన్నచూపు చూశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్న అభిప్రాయంలోనే చాలామంది వుండేవారు. ఎప్పుడైతే చంద్రబాబు అరెస్టు అయినప్పుడు హైదరాబాద్ మొత్తం చంద్రబాబు వైపు నిలబడిందో అప్పుడు చాలామందికి తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని దూరం చేయడం ఎవరి వల్లా కాదనే విషయం అర్థమైంది. బంగారానికి తావి అబ్బినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. దాంతో చాలామంది వాయిస్‌లో మార్పు వచ్చింది. ‘తెలుగుదేశం పార్టీ ఆంధ్రాపార్టీ... తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏం పని’ అంటూ అవాకులు చెవాకులు పేలిన కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే తప్పేముంది అంటూ వాస్తవంలోకి వచ్చి మాట్లాడారు. ఇలా ఇటీవల జరిగిన పరిణామాలతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి జోష్ పెరిగింది. తెలంగాణలో ఉనికిని చాటుకోవడం మాత్రమే కాదు.. తెలంగాణలో అధికారంలోకి వచ్చే సత్తా కూడా తెలుగుదేశం పార్టీకి వుందన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఇతర పార్టీల నాయకుల చూపు తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళుతోంది. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురదియెట్లన్నన్... తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.. అని సుమతి శతకకారుడు ఏనాడో చెప్పాడు కదా..!
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తూ వుండటంతో తెలుగుదేశం గూట్లోకి వచ్చి వాలిపోవాలని అనేక వలస పక్షులు ప్రయత్నాలు ప్రారంభించాయి. అలాంటి అనేక పక్షుల్లో ఒకానొక పక్షి సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్! సోమవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఇంతలో ఉరుములేని పిడుగులా బాబూమోహన్ అక్కడకి వచ్చారు. చంద్రబాబు దగ్గరకి వెళ్ళారు. పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాక బాబూమోహన్ తాను తెలుగుదేశం పార్టీలో వున్నప్పటి రోజులను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. తనకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చింది, ఎమ్మెల్యేని చేసింది, మంత్రిని చేసింది తెలుగుదేశం పార్టీయే అని తలచుకుని కళ్ళు తుడుచుకున్నారు. ఆగర్భ శత్రువు ఎదురైనా చిరునవ్వుతో పలకరించే చంద్రబాబు, బాబూమోహన్‌తో కూడా చిరునవ్వుతో మాట్లాడి పంపించేశారు. ఇలా బాబూమోహన్ టీడీపీ ఆఫీసుకి వెళ్ళి చంద్రబాబును కలవటంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. నేడో రేపో బాబూ మోహన్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, తెలుగుదేశం వర్గాలు మాత్రం ‘బాబోయ్.. బాబూమోహన్’ అంటున్నాయి.
బాబూ మోహన్ రాజకీయంగా ఎదిగిందే తెలుగుదేశం పార్టీలో. ఆయన ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవిని వెలగబెట్టినా తెలుగుదేశం పార్టీ చలవతోనే. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాబూమోహన్ తెలుగుదేశం పార్టీని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కేసీఆర్ నా ఫ్రెండ్ అంటూ టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత బాబూమోహన్ రాజకీయంగా పతనం అయిపోతూ వచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, టీఆర్ఎస్‌ని వదిలిపెట్టి, బీజేపీలో చేరి, ఆ తర్వాత బీజేపీ నుంచి కూడా బయటకి వచ్చేసి, ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నట్టు చెప్పి, ఆ తర్వాత తూచ్ నేను చేరలేదని చెప్పి... ఇలా రాజకీయాల్లో రకరకాల విన్యాసాలు చేసి, తన నియోజకవర్గం అయిన అందోలు ప్రజల మద్దతు కోల్పోయారు. ప్రస్తుతం రాజకీయాల్లో చెల్లని కాసు బాబూమోహన్. ఆయనకి ప్రజల్లో విలువ లేదు. రాజకీయాల్లో గౌరవం లేదు. బాబూమోహన్‌ని తీసుకోవడానికి ఏ పార్టీకీ ఆసక్తి లేదు. ఇలాంటి సందర్భంలో ‘పచ్చగా’ వున్న తెలుగుదేశం పార్టీ మీద బాబూమోహన్ కన్ను పడింది. పచ్చ చొక్కా వేసుకుని వచ్చి, చంద్రబాబుని కలిసి, భావోద్వేగాలు ప్రదర్శించి వెళ్ళారు. ఇలాంటి బాబూమోహన్ లాంటి అవకాశవాదులను పార్టీలోకి తీసుకోకూడదన్న అభిప్రాయాలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులలో వ్యక్తం అవుతున్నాయి. నిజమే, ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కావలసింది పోరాటం చేసే వాళ్ళే తప్ప... పదవుల కోసం పార్టీలు మారేవాళ్ళు కాదు!