పోలీసులు ఏం తీరిది?.. చంద్రబాబు ఫైర్
posted on Sep 9, 2022 8:23AM
వడ్డించే వాడు మన వాడైతే పంక్తిలో చివరన కూర్చున్నా భక్ష్యాలన్నీ మనదగ్గరకే వస్తాయని సామెత.. దానిని ఏపీలో అధికార పక్షం వారైతే చాలు ఏం చేసినా పోలీసులు వారికి అండగా ఉంటారు అని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కన్ను పొడిచేసినా స్టేషన్ బెయిలు దొరుకుతుంది. గాయపడిన వ్యక్తి మెడికల్ రిపోర్టు రాకుండానే రిమాండ్ రిపోర్టు రాసేసి స్టేషన్ బెయిలు ఇచ్చేస్తారు.
విపక్ష నేతపై దాడికి యత్నించినా పోలీసులు మర్యాదగా ఆ దాడియత్నం చేసిన వారిని వారి వారి ఇళ్ల దగ్గర దిగబెడతారు. అదే అధికార పార్టీకి వ్యతిరేకంగా చిన్న నిరసన ప్రదర్శన చేస్తే చాలు హత్యాయత్నం కేసులు నమోదు చేసేస్తారు. నినాదాలు చేస్తే శాంతి భద్రతలకు విఘ్నం కలిగించారంటూ కేసులు నమోదు చేసేస్తారు. ఇదీ ప్రస్తుతం ఏపీలో పోలీసుల తీరు. ఆ తీరుపైనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. కన్ను పొడిచేసిన వారికి స్టేషన్ బెయిలు ఇస్తారా? కేవలం నినాదాలు చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తారా అంటూ ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో పోలీసుల తీరు అధ్వానంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు తామేంటో, తామెవరి కోసం పని చేస్తున్నారో తమ తీరు ద్వారా స్వష్టంగా వెల్లడిస్తున్నారని దుయ్యబట్టారు. కుప్పంలో సాధారణ నిరసనలు చేపట్టిన తెలుగుదేశం వారిపై హత్యాయత్నం సెక్షన్ కేసు పెట్టి రిమాండ్ కు పంపిన పోలీసులు విజయవాడలో తెలుగుదేశం నేతపై దాడిచేసి కన్ను పోగొట్టిన నిందితులకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి మర్యాదగా ఇంటికి పంపారని విమర్శించారు.
ఈ రెండు ఘటనల్లో ఖాకీల వ్యవహరించిన తీరు పోలీసు శాఖ ప్రతిష్ఠకే మాయని మచ్చ అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ప్రాపకం కోసం పోలీసులు మరీ ఇంతగా దివగజారడాన్ని ప్రజలు ఆమోదించరన్నారు. ఏపీ పోలీస్ అనే బ్రాండ్ సర్వనాశనం కావడానికి, ప్రజలకు పోలీసులపై నమ్మకం పోడానికి ఈ ఘటనలు చాలన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే పోలీసులు వారికి రక్షణ కల్పించడం మాని పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారని చంద్రబాబు విమర్శించారు.