అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నట్లు.. జగన్ వైఫల్యాల పాపం చంద్రబాబుదేనా?
posted on Feb 14, 2024 @ 4:21PM
వైపీపీ తన తప్పిదాలన్నిటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారణం అంటోది. చివరకు రేపు ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే.. అందుకు కూడా జగన్ పాలనా వైఫ్యల్యం కాదు చంద్రబాబు సమర్థతే కారణమంటూ విమర్శలు గుప్పిస్తుందేమో అనిపిస్తోంది వైసీపీ నేతల మాటలు, చేతలూ చూస్తుంటే.
తాజాగా జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడానికి చంద్రబాబే కారణమంటూ చేసిన ఆరోపణలు ఇందుకు నిదర్శనం. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు తన అపార అనుభవాన్నంతా రంగరించి.. కనీసం రాజధాని కూడా లేకుండా మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించారు. ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిచేలా రాజధాని అమరావతి నిర్మాణానికి నడుం బిగించారు. నభూతో న భవిష్యత్ అన్న చందంగా రాజథాని కోసం పైసా ఖర్చు లేకుండా భూమిని సమీకరించారు. రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించారు. తాత్కాలిక భవనాలే అయినా ఇంద్ర భవనాలను తలపించే విధంగా అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలను పూర్తి చేశారు. మొత్తం పాలన అంతా అమరావతి కేంద్రంగా జరిగేలా తీర్చి దిద్దారు. అనతి కాలంలోనే అమరావతి కామధేను అన్న విషయం అందరికీ అవగతమైపోయింది. అమరావతి నిర్మాణాలను, పురోగతిని చూసేందుకు జనం తండోపతండాలుగా రావడం కూడా ఆరంభమైంది. చంద్రబాబు విధానాలు, దార్శనికత కారణంగా పరిశ్రమలు కూడా ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఏపీకి క్యూ కట్టాయి. సైబరాబాద్ నిర్మాణం తరువాత హైదరాబాద్ అభివృద్ధి ఎలా పరుగులు పెట్టిందో అంతకు మించిన వేగంతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రగతి దారిలో రేసు గుర్రంలా పరుగులు తీయడం మొదలైంది.
అయితే 2019 ఎన్నికలలో కారణాలేమైతేనేం.. ఏం లేకపోతేనేం.. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ విజయం సాధించి, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్షణం నుంచీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ తిరోగమన బాట పట్టాయి. ఇది వాళ్లూ వీళ్లూ చెబుతున్న మాట మాత్రమే కాదు.. గణాంకాలు సాక్ష్యాధారాలతో సహా వెల్లడిస్తున్న వాస్తవం. పాలన అంటే బటన్ నొక్కి పప్పుబెల్లాలు పంచినట్లుగా సంక్షేమం పేరుతో అరకొర నిధులను పందేరం చేయడమే అన్నట్లుగా జగన్ పాలన సాగింది. అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు హయాంలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని ఆనవాలు లేకుండా చేయాలన్న కంకణం కట్టుకున్నట్లుగా విధ్వంస పాలనకు జగన్ తెరతీశారు. ప్రజాదర్బార్ కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలన గత ఐదేళ్లుగా అప్రతిహాతంగా సాగుతూనే ఉంది. గుంతల రోడ్లు, నీరు పారని కాలువలు, సాగుకు నోచని భూములు, కొత్త పరిశ్రమల రాక సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి తరలిపోవడం జగన్ సుందరముదనష్ట పాలనకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
అమరావతి ని నిర్వీర్యం చేశారు. రాష్ట్రం కోసం, రాజథాని కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిచ్చిన రైతులను నానా రకాలుగా వేధించారు. చట్టాలను లెక్క చేయకుండా ఇష్టారీతిన వ్యవహరించారు. చివరికి జనానికి ముఖం చూపించలేక.. జగన్ తన పర్యటనలను పరదాల మాటున కానిచ్చేస్తున్నారు. బటన్ నొక్కేందుకు తప్ప బయటకు రాలేని పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నారు.
ఎన్నికల ముంగిట ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఏం చేయాలో, అసలెలా ముందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో మరిన్ని తప్పుటడుగులు వేస్తున్నారు. ఆ తప్పుటడుగుల్లో అతి ముఖ్యమైనది తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ చేసిన ప్రకటన.
ఆ ప్రకటనే ఇంత కాలం మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ చేసిన తతంగమంతా పనికిరాని వ్యవహారమని తేలిపోయింది. విశాఖ నుంచి పాలన అన్నది ఉత్తిదేనని రుజువైపోయింది. ఇప్పుడు విభజన చట్టంలో పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ పొందుపరిచిన అంశానికి దుమ్ము దులిపి బయటకు తీశారు సుబ్బారెడ్డి. జూన్ తో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుంది. కానీ ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డికి ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందన్న విషయం గుర్తుకు వచ్చింది. అలా ఎలా కుదురుతుంది. హైదరాబాద్ ను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా మరి కొన్నేళ్ల పాటు పొడిగించాలంటూ కేంద్రాన్ని కోరదాం అందుకోసం పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. అసలు ఈ ఐదేళ్లుగా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా తాను చెప్పిన మూడు రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా వేయని జగన్ తప్పిదాల గురించి ప్రస్తావించకుండా ఉమ్మడి రాజధాని కోసం పోరు అన్న పిలుపు వెనుక ఇటు ఏపీలోనూ, అటు తెలంగాణలోనూ విభజనకు ముందు నాటి ఉద్వేగాలను రెచ్చగొట్టాలన్న దురుద్దేశమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపి సీనియర్ నేతలలో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి జగన్‌కు బంధువు కూడా. అటువంటి వైవీ సుబ్బారెడ్డి జగన్‌కు తెలియకుండా, జగన్ ప్రోత్సాహం లేకుండా, అన్నిటికీ మించి ఆయన ఆదేశం లేకుండా హైదరాబాద్‌ని మళ్ళీ ఉమ్మడి రాజధానిగా చేయాలనే ప్రతిపాదన చేయరు కాక చేయరు అని అంటున్నారు. వైవీ ప్రకటన వెనుక ఉన్నది జగన్ వ్యూహమే అని గట్టిగా చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం ద్వారా అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. రాజకీయంగా రోజు రోజుకూ వెనుకబడిపోతున్న బిఆర్ఎస్ పార్టీకి, లోక్‌సభ ఎన్నికలకు ముందు సెంటిమెంట్ అస్త్రాన్ని అందించడమే కాకుండా, ఇటు ఏపీలో కూడా హైదరాబాద్ లో ఏపీ వాటా అన్న అంశాన్ని ప్రజలలో నాటుకునేలా చేయాలన్న దురాలోచన ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే వ్యూహంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు సాగర్ నీటిలో వాటా అంటూ నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు పోలీసులను పంపిన సంగతి ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నాడు ఆ ప్రయత్నం, కుట్రా కేసీఆర్ ను రక్షించలేకపోయింది. అది వేరే సంగతి. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి తన మిత్రుడికి లోక్ సభ ఎన్నికలలో సహాయపడాలన్న ఆత్రం కనిపిస్తోందంటున్నారు. అయితే ఈ దురాలోచన, దుష్ట వ్యూహం తెలంగాణలో ఏ మేరకు పని చేస్తుందో తెలియదు కానీ, ఏపీలో మాత్రం బూమరాంగ్ కావడం ఖాయం.
ఒక రోజు ఆలస్యంగా ఆ విషయాన్ని వైసీపీ గుర్తించింది. ఉమ్మడి రాజధాని విషయం ఎత్తితే ఈ ఐదేళ్లలో నీ నిర్వాకం ఏమిటి? అని జనం నిలదీస్తారన్న భయం పట్టుకుంది. దీంతో నష్ట నివారణకు బొత్స సత్యనారాయణను జగన్ రంగంలోకి దింపారు. గతంలో వోక్స్ వ్యాగన్ విషయంలో నిండా మునిగిపోయిన తరువాత సొమ్ములు పోనాయి మరేటి చేస్తాం అన్నట్లుగానే ఇప్పుడు.. మూడు రాజధానులు కట్టలేకపోయాం, అయినా ఇప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని అనలేం.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు మీడియా వక్రభాష్యం చెబుతోందంటూ మీడియా ముందుకు వచ్చేశారు బొత్స. అంతే కాదు అసలు ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనంటూ భాష్యం చెప్పారు. అమరావతి నిర్మాణానికి పూనుకోవడమే చంద్రబాబు చేసిన తప్పిదమంటూ వక్రభాష్యం చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అయినా హైదరాబాద్ వదిలి వచ్చేసి చంద్రబాబు తప్పు చేశారంటూ బొత్స తనకే అర్థం కాని తర్కాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. తన హయాంలో అమరావతిలో అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మించి పాలనను కూడా అక్కడ నుంచే చంద్రబాబు ప్రారంభించారనీ, ఇప్పటికీ అదే సచివాలయ, అసెంబ్లీ భవనాలలోనే జగన్ పాలన సాగిస్తున్నారనీ బొత్స కన్వీనియెంట్ గా మరచి పోయారు.
జగన్ కూడా చంద్రబాబులా అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తరలివచ్చేవి. కానీ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందన్న దుగ్ధతో, వ్యక్తిగత కక్షతో జగన్ అమరావతిని పక్కన పెట్టేశారు. ఇదే జగన్ అప్పట్లో అమరావతిని శ్మశానంగా అభివర్ణించారు. ఇంత చేసీ తన ఐదేళ్ల పాలనలో జగన్ మూడు రాజధానుల దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో వైవీ ప్రకటన, ఆ తరువాత బొత్స ఖండనలే వచ్చే ఎన్నికలలో వైసీపీ పతనాన్ని ఖరారు చేసే కీలక అంశాలుగా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.