మంత్రిగా నేను చంద్రబాబుకు చెప్పా.. నువ్వు జగన్ కు చెప్పలేవా
posted on Jun 9, 2020 @ 6:49PM
ఏ రాష్ట్రం లోనైనా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కామన్. ఐతే ఏపీలో మాత్రం దాని తీవ్రత ఎక్కువే అని చెప్పవచ్చు. తాజాగా చంద్రబాబును విమర్శించిన మంత్రి బొత్స పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విరుచుకు పడ్డారు. బొత్స ఉత్తరాంధ్ర ద్రోహి అని, చంద్రబాబును విమర్శించే అర్హత బొత్సకు లేదని అయ్యన్న అన్నారు. వోక్స్ వ్యాగన్ వైజాగ్ కు వచ్చి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేదని వేలాది మందికి ఉపాధి లభించేదని అయన అన్నారు. ఒకప్పుడు వైఎస్ మరణానికి జగన్ కారణమని చెప్పిన బొత్స ఇపుడు అదే జగన్ వద్ద చేరి భజన చేస్తున్నారని విమర్శించారు.
గతంలో బొత్స కూడా మద్యం వ్యాపారం చేసారని, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆదాయం వస్తే చాలన్నట్లుగా వారి ధరణి ఉందని విమర్శించారు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న తను వైజాగ్ లో పేదల భూములు కబ్జా కు గురవుతున్నాయని ఫిర్యాదు చేసానని మరి ఇపుడు బ్రాందీ పేరుతో విషం అమ్మవద్దని జగన్ వద్ద ఎందుకు చెప్పలేక పోతున్నారని ఆయన బొత్సను నిలదీశారు. చంద్రబాబు హయాం లో ఏపీకి అనేక పరిశ్రమలు వచ్చాయని ఐతే జగన్ ఏడాది పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అయ్యన్న విమర్శించారు. అధికార పార్టీ నేతలు రాజధాని అమరావతిని స్మశానం అంటున్నారని, ఐతే ప్రభుత్వానికి 65 సార్లు మొట్టికాయలు వేసిన హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ అక్కడే ఉన్నాయని అయన గుర్తు చేసారు.