కొండంత దేశం ఆస్ట్రేలియా... అయినా అధికభాగం ఖాళీ.. ఎందుకంటే?
posted on May 8, 2025 @ 4:56PM
ఇదొక చిత్రమైన వాస్తవం. అవును ఆస్ట్రేలియా భౌగోళికంగా చాలా పెద్ద దేశం. ప్రపంచంలోనే ఆరవ అతి పెద్ద పెద్ద దేశం. నిజానికి ఆస్ట్రేలియా భారత దేశం సహా అనేక పెద్ద దేశాలకంటే చాలా పెద్ద దేశం. మన దేశం వంటి రెండు సువిశాల దేశాల భౌగోళిక విస్తీర్ణంతో సమానమైన భౌగోళిక విస్తీర్ణం ఉన్న దేశం ఆస్ట్రేలియా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొత్తం యూరప్ దేశాలను కలిపి చుట్టినా.. ఆస్ట్రేలియా విస్తీర్ణంతో సరి తూగదు.
అయితే.. విస్తీర్ణంలో పే.. ద్ద దేశమే అయినా.. ఆస్ట్రేలియాలో వినియోగంలో ఉన్న భూమి మాత్రం అత్యల్పం. అవును. కేవలం ఐదు శాతం భూమి మాత్రమే వినియోగంలో వుంది. మిగిలిన 95 శాతం భూమి ఖాళీ. చెట్టూ, పుట్టా ఏదీ లేని నిర్జన, నిర్జీవ ప్రదేశం. అందుకే దేశం పెద్దదే అయినా, జనాభా లెక్కలలోకి వస్తే మాత్రం చాలా చిన్నదేశాల కంటే చాలా తక్కువ జనాభా ఉన్న దేశం ఆస్ట్రేలియా. అవును.. ఆ దేశ మొత్తం జనాబా, మన దేశ రాజధాని ఢిల్లీ జనాభా (34,666,000) కంటే తక్కువ. విశేషం చూడండి. ఆస్ట్రేలియా భౌగోళికంగా మన దేశం కంటే రెండు రెట్లు పెద్ద దేశం. కానీ ఆ దేశ ప్రస్తుత జనాభా 26, 933,653 మాత్రమే. అంటే, మన దేశ జనాభాలో ఆరోవంతు మాత్రమే.
అదలా ఉంటే.. ఆస్ట్రేలియా చిత్రాల్లో ఇంకో విచిత్రం కూడా వుంది. ఆ దేశ భూభాగంలో 95 శాతం కంటే ఎక్కువ భూభాగం ఖాళీగా ఉంటుంది. ఆస్ట్రేలియా మొత్తం భూభాగంలో కేవలం జనజీవనానికి అనుకూలమైన భూభాగం అతి తక్కువ. దేశ జనాభాలో 95 శాతం మంది ప్రజలు కేవలం 0.22 శాతం భూభాగంలో జీవిస్తున్నారు. అవును. అంత పెద్ద దేశంలో కేవలం ఐదు నగరాలు.. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్ లలో మాత్రమే జన జీవనం కనిపిస్తుంది. మిగిలిన భూభాగం జన జీవనానికి ఎంత మాత్రం అనుకూలం కాదు. అంటే.. ఆస్ట్రేలియా ప్రజలు జీవిస్తున్న భూభాగం ఆ దేశ భౌగోలిక స్వరూపంలో ఒక శాతం కంటే తక్కువ. దేశం నలు దిక్కులలో ఏ దిక్కు నుంచి లోపలకు వెళ్ళినా.. లోపలకు వెళ్ళే కొద్దీ మనిషి బతికే అవకాశాలు సన్నగిల్లుతాయి. ముందుకు వేసే ప్రతి అడుగూ మృత్యువుకు మరింత దగ్గర చేస్తుంది. అలాగే.. గీత దాటితే ఇక తిరిగి రావడం ఉండదు. అందుకే.. ఆస్టేలియా భూభాగంలో 95 శాతం భూభాగం ఈరోజుకూ కూడా నిర్జన, నిర్జీవ ప్రాంతంగా ఖాళీగా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా ఇప్పటికీ ఎందుకు ఖాళీగా వుంది? అంటే అందుకో పెద్ద కథే వుంది.
ఆ వివరాలోకి వెళితే.. నిజానికి ఆస్ట్రేలియా అబోరిజినల్ (Abor Ginel)దేశం. ఆస్ట్రేలియా మూలవాసులు, ఈ అబోరిజినల్స్. మన దేశం ఎలాగైతే హిందు దేశం అయిందో, అలాగే ఆస్ట్రేలియా అబోరిజినల్స్ దేశం. వాస్తవంగా ఆస్ట్రేలియా మూలవాసులైన ఆదివాసుల సొంతం. ఆదివాసుల స్వదేశం. అయితే ఈ రోజున ఆస్ట్రేలియాలో ఆ దేశ మూలవాసులైన ఆదివాసుల కంటే శ్వేత జాతీయులే ఎక్కువ కనిపిస్తారు. మరి మూలవాసులు అబోరిజినల్స్ ఏమై పోయినట్టు.. ఎలా అంతరించి పోయారు అంటే మళ్ళీ అది మరో పెద్ద కథ.
భారత దేశంలో అక్రమంగా ప్రవేశించి రెండు వందల ఏళ్లకు పైగా పాలించిన బ్రిటిష్ వలస పాలకులే ఆస్ట్రేలియాలోనూ వలస పాలన సాగించారు. మన దేశంలో ఎలాగైతే లక్షలమందిని పొట్టనపెట్టుకున్నారో అలాగే ఆస్ట్రేలియాలోనూ బ్రిటిష్ పాలకులు ఆస్ట్రేలియాలో అనేక రూపాల్లో మారణ హోమాన్ని సాగించారు. దుర్మార్గంగా భూములను దోచుకున్నారు. స్థానికులను బానిసలు చేశారు. అమాయక అబోరిజినల్స్ ను అనేక రూపాల్లో వేధింపులకు గురి చేశారు. చిత్ర హింసలు పెట్టారు. అణచి వేశారు. చివరకు మారణ హోమం సృష్టించారు. సాముహిక హత్యా కాండను సృష్టించారు. అబోరిజినల్స్ జాతిని నామరూపాలు లేకుండా చేశారు. ఇలా ఒక జాతిని మొత్తాన్ని లేకుండా చేసేందుకు ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో వింటేనే గుండెలు తరుక్కు పోతాయి.
ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట వ్యాపారం ముసుగులో భారత దేశంలోకి ప్రవేశించిన విధంగానే బ్రిటిష్ పాలకులు 1606 వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో కాలు పెట్టారు. అంతవరకూ అబోరిజినల్స్ ఇతర స్థానిక జాతుల ప్రజలు ఆహరం, ఔషధం, ఆయుధం అన్నిటికీ అడవి తల్లినే నమ్ముకున్నారు. అడవి తల్లి బిడ్డలుగానే జీవితం సాగించారు. అంతేకాదు.. ఆస్ట్రేలియా మూలవాసులకు భూమి క్రయ విక్రయాలు తెలియవు. కంచెలు కట్టుకుని భూమిని సొంతం చేసుకోవడం అసలే తెలియదు. అయితే.. బ్రిటిష్ వారు అడుగు పెడుతూనే తమ వ్యాపార సంస్కృతిని వెంట పెట్టు కొచ్చారు. అలాగే.. వ్యాపార సంస్కృతితో పాటుగా మశూచి వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా తీసుకువచ్చారు. ఈ వ్యాధులు ఇంతకు ముందు ఆస్ట్రేలియాలో లేవు. కాబట్టి స్థానిక ప్రజలకు రోగనిరోధక శక్తి లేదు. ఫలితంగా.. కొవిడ్ వంటి ఆరోగ్య విపత్తు తలెత్తింది. ఒక సంవత్సర కాలంలో, ఒక్క మశూచి వ్యాధి ఒక్కటే ఒక్క సిడ్నీలోనే 50 శాతం జనాభాను తుడిచిపెట్టింది. పోర్ట్ ఫిలిప్ ప్రాంతంలో కూడా ఇలాంటి వినాశనమే సంభవించింది.
ఇందులో విశేషం విషాదం ఏమంటే, ఈ వ్యాధులకు ఎలా చికిత్స చేయాలో బ్రిటిషర్స్ కు తెలుసు. అయినా వ్యాధి సోకిన స్వదేశీ సమాజాలకు చికిత్సను అందించలేదు. చనిపోయేలా చేశారు. చనిపోతుంటే చూస్తూ ఊరుకున్నారు. 1900లలో దేశంలో కలరా, మశూచి, మలేరియా వంటి వ్యాధులు సోకినప్పుడు భారత దేశంలో ఏమి జరిగిందో.. అదే ఆస్ట్రేలియాలో అదే జరిగింది. వ్యాధి నివారణ టీకాలు, చికిత్సా సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులో ఉన్నా, బ్రిటిషర్స్ ఉద్దేశపూర్వకంగానే దుర్మార్గానికి ఒడి కట్టారు. లక్షలాది మంది భారతీయుల మరణాలకు కారకులయ్యారు.ఆస్ట్రేలియన్ల విషయంలోనూ అదే జరిగింది.
ఇంతకు ముందే అనుకున్నట్లుగా బ్రిటిషర్స్ వస్తూ వస్తూ పట్టుకొచ్చిన వ్యాపార సంస్కృతీని మెల్ల మెల్లగా అమలు చేయడం ప్రారంభించారు. భూమిని ఆక్రమించుకోవడం, ఆక్రమించు కున్న భూమికి కంచె వేయడం ప్రారంభించారు. స్థానిక ఆదివాసీల జీవనాధారమైన వేట పై వేటు వేశారు. స్థానికులకు స్వచ్ఛమైన నీరు అందకుండా చేశారు. ఆహార సేకరణను నిరోధించారు. ఆ విధంగా బ్రిటిషర్స్ స్థానిక జాతుల ప్రజలను వారి స్వంత భూములలోనే కూలీలను చేశారు. అదే క్రమమంలో వారి ఆధిపత్యాన్నినిలుపుకునేందుకు బ్రిటిషర్స్ స్థానిక స్త్రీలను, పిల్లలను భయంకరమైన వేధింపులకు గురిచేశారు. గర్భిణీ స్త్రీలతో బలవంతంగా పని చేయించారు. తల్లీ, తల్లి గర్భంలోని పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి ముత్యాలను సేకరించడానికి ప్రమాదకరమైన జలాల్లోకి పంపారు. ఆ విధంగా అనేక మంది తల్లీ పిల్లల ప్రాణాలను బలితీసుకున్నారు.
ఈ దుర్మార్గాలను భరిస్తూ వచ్చిన స్వదేశీ ఆస్ట్రేలియన్లు కొంత కాలానికి విసిగి పోయారు. 1795లో ఇక భరించలేమన్న నిర్ణయానికి వచ్చారు. తిరుగుబాటుకు దిగారు. ఇది వందేళ్ళ యుద్ధాలకు దారితీసింది. ఈ ఘర్షణలు, వ్యాధులు, భరించరాని శారీరక శ్రమ కారణంగా స్వదేశీ జనాభా క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. 1900 సంవత్సరం నాటికి, 3 నుండి 7.5 మిలియన్ల నుండి కేవలం30,000 నుండి 75,000 కు పడిపోయింది. అంటే.. 90శాతం స్థానిక సమూహాలు అంతరించి పోయాయి.
కానీ బ్రిటిష్ వారు అక్కడితో ఆగలేదు. స్వదేశీ జనాభాను మరింత తగ్గించడానికి మరొక దుర్మార్గ మార్గాన్ని తెరిచారు. ప్రథమ ప్రపంచ యుద్ధ సమయంలో పెద్ద సంఖ్యలో పురుషులను యూరప్‌కు పంపారు. వారిలో 40శాతం మంది తిరిగి రాలేదు. అంటే యుద్ధంలో చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం మరింత విధ్వంసం సృష్టించింది. వైమానిక దాడులు, సైనిక ప్రమేయం జనాభాను మరింత నాశనం చేసింది. దీనికి తోడు శ్వేతజాతీయులు కాని వారిని దేశం వెలుపల ఉంచే లక్ష్యంతో 1901 చేసిన వలస నియంత్రణ చట్టం.. వైట్ ఆస్ట్రేలియా పాలసీ, స్వదేశీ ఆస్ట్రేలియన్లకు స్వదేశంలోనే చోటు లేకుండా చేసింది. ఈ విధానం స్వదేశీ జనాభాను కోతలకు గురిచేసింది. చివరకు.. ఆస్ట్రేలియాలో శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దాదాపు 26 మిలియన్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. అయితే, ఇందులో కేవలం 3.8 శాతం మంది.. అంటే దాదాపు 10 లక్షల మంది మాత్రమే స్థానికులు. ఇది మన దేశంలో ఓ చిన్న పట్టణం జనాభా కంటే తక్కువ. మరో వంక ఆస్ట్రేలియా భూభాగంలో ఎక్కువ భాగం నిర్జీవంగా, నిర్జనంగా వుంది. దేశ జనభాలో ఎక్కువ శాతం సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్, నగరాల్లోనే కేద్రీకృతమై వుంది.
ఆస్ట్రేలియాలో జనాభా పెరుగుతోంది. అయినా ఇప్పటికీ 95 శాతం ఖాళీగా ఎందుకు ఉందంటే, అందుకు భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణం ప్రధాన కాణంగా పేర్కొనవచ్చును. ఆస్ట్రేలి యాలో విస్తారమైన ఎడారులు, ఉప్పునీటి నదులు, తుఫానులకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువ. దేశంలోని దక్షిణ భాగం చల్లగా ఉంటుంది. పచ్చని ప్రాంతాలు,పర్వతాలు లేకపోవడం వల్ల, ఇక్కడ తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీని వలన ఆస్ట్రేలియాలో 70 శాతం భూభాగం ఎడారిగా, మానవ నివాసానికి పనికిరాని ప్రదేశంగా ఖాళీగా వుంది.
మరోంక మధ్య లోతట్టు ప్రాంతాలలో, భూమి, కొండులు గుట్ట్టలు రాళ్ళలో లవణీయత అంటే ఉప్పు శాతం ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతంలో నీరు ఉప్పగా ఉంటుంది. తాగేందుకు కాదు, కనీసం వ్యవసాయానికీ పనికి రాదు. తూర్పు ప్రాంతంలో ఎత్తైన ప్రాంతాలు, జన జీవనానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఆ ప్రాంతం నిలయం. ఈ పరిస్థితి అక్కడ కూడా మనుగడ కష్టతరం చేస్తున్నది.
ఇలా, వలస పాలకుల దుర్మార్గ చరిత్ర, జనజీవనానికి అనుకూలించని వాతావరణ, పర్యావరణ పరిస్థితులు..భౌగోళిక ప్రతికూల పరిస్థితులు వెరసి ఆస్ట్రేలియా ప్రపంచ పటంలో జనజీవనానికి అంతగా పనికిరాని భూభాగం అధికంగా గల దేశంగా మిగిలింది. అందుకే.. నేటికీ, జనాభాలో ఎక్కువ భాగం ఆ ఐదు నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంది, మిగిలిన విశాల భూభాగం .. నిర్జీవంగా, నిర్జనంగా మిగిలింది.