'అత్తారింటికి దారేది' రివ్యూ: పవర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
posted on Sep 27, 2013 @ 11:34AM
ఎన్నో వాయిదాలు, వివాదాలు అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం త్రివిక్రమ్ తరహా పంచ్ లతో, పవన్ పవర్ ఫెరఫార్మెన్స్ తో అదరకొడుతుందనే నమ్మకం టీజర్ విడుదల అయిననాటి నుంచీ అందరిలో వ్యక్తమవుతోంది. పైరసి బారిన పడిన కారణంగా దసరా కానుకగా రావల్సిన ఈ సినిమా రెండు వారాల ముందే థియేటర్లలోకి వచ్చేసింది. మరీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం:
స్టోరీ:
రఘునందన్ (బోమన్ ఇరానీ) మిలాన్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త, అతని మనవడు గౌతమ్ నంద (పవన్ కళ్యాణ్). రఘునందన్ కూతురు సునంద (నదియా) తనకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకోవడంతో ఇంట్లో నుంచి పంపించేస్తాడు. ఆ తరువాత చాలా కాలం వరకు సునంద, రాఘునందన్ మధ్య సంబంధాలు వుండవు.
రఘునందన్ ముసలివాడు అయిన తరువాత తన తప్పు తెలుసుకొని తన కూతురుని ఒప్పించి ఎలాగైన ఇండియా నుంచి తిరిగి తీసుకొనిరమ్మని తన మనవడు గౌతమ్ నందని అడుగుతాడు. తాత కోరిక తీర్చడానికి గౌతమ్ నంద 'మిలాన్' నుండి 'ఇండియా'వస్తాడు. ఇండియాకి వచ్చిన గౌతమ్ నంద తన అత్తను ఒప్పించడానికి ఎలాంటి దారిని ఎంచున్నాడు. ఆ దారిలో ఎలాంటి వ్యూహాలు రచించాడనేదే...'అత్తారింటికి దారేది' కథ.
కళాకారుల పెర్ఫామెన్స్:
పవన్ కళ్యాణ్ అంటేనే ఎంటర్ టైన్మెంట్...ఈ సినిమాలో పవర్ స్టార్ తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కామెడీ, సెంటిమెంట్, డైలాగ్ డెలివరీ ప్రతి దాంట్లోను బెస్ట్ పెర్ఫామెన్స్ తో అలరించాడు. కేవ్వుకేక’ సాంగ్ కి స్పూఫ్, కాటమరాయుడ సాంగ్ మరియు దానికి ముందు వచ్చే ఓ ఎపిసోడ్ లో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.
'సమంత' టాలీవుడ్ లో ఆమె గోల్డెన్ రన్ కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఈ సినిమాలో రొమాన్స్ కొంచెం తక్కువగానే వున్న..ఆమె వున్న సన్నివేశాలలో మాత్రం 'సమంత' ఆకర్షణగా నిలుస్తుంది. ప్రణిత పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ ఉన్నంతవరకూ బాగానే చేసింది. అలాగే బాపు గారి బొమ్మ పాటలో చీరల్లో అందంగా కనిపించింది.
'బోమన్ ఇరానీ' కథకు ముఖ్యమైన పాత్ర. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పవన్ కళ్యాణ్ అత్త క్యారెక్టర్ లో 'నదియా' నటన చాలా బాగుంది. బ్రహ్మానందం సెకండాఫ్ లో బాగా నవ్వించాడు. బ్రహ్మానందంపై తీసిన రెడియేటర్ స్పూఫ్, అహల్య ఎపిసోడ్ చాలా ఎంటర్ టైనింగ్ వున్నాయి. ఎంఎస్ నారాయణ, అలీ, పోసాని కృష్ణమురళి తమ వంతు నవ్వించగా, రావు రమేష్, కోట శ్రీనివాస రావులు తమ పరిధిమేర నటించారు.
సాంకేతిక విభాగం:
త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈ సినిమాకి మరో స్టార్ అని చెప్పాలి. సింపుల్ స్టోరీ లైన్ ను చాలా బాగా హాండిల్ చేశారు. తన మాటల మంత్రాలతో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఎంటర్ టైనింగ్ గా చిత్రీకరించారు. సెంటిమెంట్ సన్నివేశాలలో కూడా త్రివిక్రమ్ పదునైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. పవర్ స్టార్ కళ్యాణ్ నుంచి ఏమేమి కోరుకుంటారో ఆ అంశాలన్నిటినీ కలగలిపి ఇచ్చిన ప్యాకేజీనే ‘అత్తారింటికి దారేది'.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఆయన అందించిన సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ప్రసాద్ మూరెళ్ళ సినిమాకి స్టన్నింగ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.
నోట్: టాలీవుడ్ లో 'బూతు' ఎక్కువైన ఇలాంటి రోజుల్లో..ఒక పెద్ద స్టార్ సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు, పాటలు లేకుండా 'క్లీన్' సినిమాని తీసినందుకు పవర్ స్టార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అభినందించాలి.
పంచ్ లైన్: ''అత్తారింటికి దారేది''...పవన్ దెబ్బకు పైరసికి దారిలేదు