అభిమానులకి అత్తారింటికి దారే దొరకలేదట
posted on Jul 18, 2013 @ 8:06PM
పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ శుక్రవారంనాడు హైదరాబాద్ శిల్పకళావేదికలో జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి పాసులు ఇచ్చేటప్పుడు ఆడిటోరియంలో ఉన్నసీట్లకి సరిపోయినంత మాత్రమే పాసులు జారీ చేయమని పవన్ కళ్యాణ్ నిర్మాతను కోరినట్లు సమాచారం. ముందుగా తన అభిమానులకి, ఫిలిం పంపిణీదారులకి, సినిమా యూనిట్ సభ్యులకి ఇచ్చిన తరువాతనే వీఐపీలకు, ఇతరులకు కేటాయించమని కోరారు. అదేవిధంగా పాసులు దొరక్క ఆడిటోరియం బయట ఉండిపోయే తన అభిమానుల పట్ల సెక్యురిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించకుండా ఆదేశించమని, అదేవిధంగా వారు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా తగిన ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవలసిందిగా పవన్ కళ్యాణ్ నిర్మాతను కోరినట్లు తెలుస్తోంది.
బహుశః పాసుల విషయంలో ఈ సారి ఖచ్చితంగా ఉండాలని ఆదేశించినందువలనే కొంత మంది అభిమానులకు పాసులు దొరకకపోవడంతో తీవ్రనిరాశ చెంది, వారు ఆగ్రహంతో హైదరాబాద్ లో గల చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద పాసుల కోసం చాలాసేపు ధర్నా చేసారు. అయితే అక్కడి సిబ్బంది వారికి నచ్చజెప్పి పంపేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే అందరికీ తమ ఇంట్లో ఫంక్షన్ లాగానే ఉంటుంది. మరి పాసులు దొరకక ఫంక్షన్ వెళ్ళలేకపోతే వారెంత బాధ పడి ఉంటారో దీనిని బట్టి అర్ధం అవుతోంది.