జగన్ బానిసత్వంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్!
posted on Jun 23, 2024 @ 10:46PM
అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు జగన్ పార్టీ పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడంలో వెనక్కి తగ్గడం లేదు. సాక్షాత్తూ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు తాను తొలి సంతకం చేసేందుకు సిద్ధం చేయాలని చెప్పిన దస్త్రాన్ని సైతం సెక్రటరీ జనరల్ సిద్ధం చేయకపోవడం అసెంబ్లీలో పెద్ద చర్చనీయాంశమైంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలోకి రాకుండా ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లపై నిషేధం విధించారు. నిషేధాన్ని ఆ సభ రద్దయ్యేంతవరకూ కొనసాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఈ చానెళ్లపై నిషేధాన్ని రద్దు చేయాలని టీడీపీ శాసనసభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర సెక్రటరీ జనరల్‌కు ఈ నెల 20నే విజ్ఞాపనపత్రం సమర్పించారు. ‘గత ప్రభుత్వంలో చీఫ్ విప్ ఫిర్యాదు చేశారంటూ హడావుడిగా ఈ ఛానెళ్లపై నిషేధం విధించారు. ఆయా ఛానెళ్లు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా పక్కనపెట్టేశారు.
ఇప్పటికైనా ఆ నిషేధాన్ని రద్దు చేయాలని నరేంద్ర కోరారు. అయినా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎలాంటి చర్య తీసుకోలేదు. నిన్న ఉదయం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆయన కార్యాలయంలో దూళిపాళ్ల నరేంద్ర కలిసి తాను ఇచ్చిన లేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సెక్రటరీ జనరల్‌కు చెప్పారు. ఉన్న మూడు ఛానళ్ల ప్రాతినిధులకు అధికారికంగా పాస్‌లు జారీచేశామని, అసెంబ్లీ సమావేశాలు కవరేజీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెబుతూ, నిషేధం ఎత్తివేత విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సెక్రటరీ జనరల్ ప్రయత్నించారు.
నిన్న ఉదయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా సెక్రటరీ జనరల్‌ను పిలిపించుకుని తాను స్పీకర్‌గా తొలి సంతకం ఈ ఛానెళ్ల నిషేధం ఎత్తివేతపైనే పెడతానని దానికి సంబంధించిన దస్త్రాన్ని సిద్ధం చేసి తీసుకురావాలని ఆదేశించారు. అప్పడు కూడా ఆయన ఇలాంటి వాటిని మీరు సభలో ప్రకటించలేరు, అది, ఇది అంటూ నిబంధనల గురించి చెప్పినట్లు తెలిసింది. అందుకు సభాపతి బదులిస్తూ తాను సంతకం చేయాలో తెలుసునని, ఛాంబర్‌లో బాధ్యత తీసుకున్నపుడు చేస్తానని, ముందు దస్త్రం సిద్ధం చేసుకురమ్మని స్పష్టంగా ఆదేశించినట్లు సమాచారం.
తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్పీకర్ తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో ఈ దస్త్రం గురించి అడగా ఇంతకాలం రికార్డుల్లో పెట్టేసిన పాత దస్త్రాన్ని ఆయన ముందుంచారు. ఆ దస్త్రాన్ని పరిశీలించిన సభాపతి ఇదేంటి ఇలా ఉంది? అని అడిగారు. అందులోనే దూళిపాళ్ల నరేంద్ర ఇచ్చిన లేఖ కూడా ఆ దస్త్రంలోనే ఉండడం చూసి ఇదేంటి ఇక్కడుంది అని స్పీకర్ అడగగా, ఆయన ఇంతకుముందు లేఖ ఇచ్చారని సెక్రటరీ జనరల్ సమాధానం చెప్పారు.
పూర్తిగా సిద్ధం చేసుకురా అని ఈ ఫైల్‌పై తాను ఎక్కడ సంతకం చేయాలి అంటూ స్పీకర్ కార్యదర్శిని నిలదీశారు. కంప్యూటర్‌లో టైప్ చేసుకుని తేలేదేంటి? అని ప్రశ్నించగా రామాచార్యులు నీళ్లు నమిలారు. అదే దస్త్రాన్నే అటూ ఇటూ తిప్పి చూపించబోయారు. స్పీకర్ కలుగజేసుకుంటూ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు దస్త్రంలో ఎక్కడా లేదేంటి? అది చేసుకుని రండి అని ఆదేశించారు. అయితే సెక్రటరీ జనరల్ మాత్రం అదే పాత దస్త్రం చివర్లో తమ సహాయకుడితో పెన్‌తో రాయించేందుకు సిద్ధమయ్యారు. అది రాయించేందుకూ ఆయన తటపటాయిస్తుండడం చూసిన స్పీకర్ కలుగజేసుకుంటూ నిషేధాన్ని వెంటనే ఎత్తేస్తూ చర్యలు తీసుకోండి అని రాయమని చెప్పారు. సహాయకుడు అది రాయడంతో స్పీకర్ సంతకం పెట్టారు.
అలా మొత్తమ్మీద చివరివరకూ స్పీకర్‌ను కూడా ఏమార్చేందుకు సెక్రటరీ జనరల్ రామాచార్యులు అన్ని విధాలా ప్రయత్నించడంపై అసెంబ్లీ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో శాసనమండలి సభ్యుల అనర్హత విషయంలోనూ వైఎస్సార్సీపీ ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరించారనే ఆరోపణలు ఈయన పై ఉన్నాయి.