కాంగ్రెస్ బీజేపీలకి వీర సైనికుడి భార్య చెంపపెట్టు
posted on Aug 8, 2013 @ 12:25PM
రక్షణ మంత్రి అంటోనీ “పాక్ సైనికుల దుస్తులలో వచ్చిన కొందరు వ్యక్తులు భారత సైనికులను చంపారని” చేసిన ప్రకటనను పట్టుకొని పార్లమెంటులో కాంగ్రెస్ బీజేపీలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటుంటే, వారికి గడ్డి పెడుతున్నట్లుగా పాకిస్తాన్ సైనికుల దాడిలో మృతి చెందిన సైనికుడు విజయ రాయ్ భార్య పుష్పారాయ్ ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని తిరస్కరింఛి, ముందు తన భర్తను పొట్టన బెట్టుకొన్న పాకిస్తాన్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వలననే తన భర్త చనిపోయాడని, ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూ అనేకమంది సైనికులు చనిపోతున్నపటికీ, ప్రభుత్వంలో ఎటువంటి మార్పు కలగకపోవడం చాలా విచారకరమని ఆమె అన్నారు. ఇకనయినా ప్రభుత్వం మేల్కొని అటువంటి దుష్కర మూకలను పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వానికి దీటుగా జవాబు చెప్పాలని ఆమె కోరారు. ఇంకా ఎంత కాలం ఈవిధంగా సైనికులు తమ ప్రాణాలు పాక్ సైనికులకు బలివ్వాలి అని ఆమె ఆవేదనతో ప్రశ్నించారు.
చనిపోయిన ఐదుగురు జవాన్లలో నలుగురు బీహార్ రాష్ట్రానికే చెందిన వారే కావడంతో సర్వత్రా నిరసనలు, రైల్ రోకోలు జరుగుతున్నాయి. రక్షణ మంత్రిని క్షమాపణ చెప్పమని బీజేపీ పట్టుబడుతుంటే, ఆయన పూర్తి సమాచారంతో మళ్ళీ పార్లమెంటుకు సమాధానం చెపుతానని శలవు తీసుకొన్నారు. కానీ రెండు పార్టీలు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాత్రం చర్చించేందుకు మాత్రం ఆసక్తి కనబరచలేదు.
ఆ సైనికుడి వీరపత్ని ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని తిరస్కరించిన తరువాతయినా ఈ కాంగ్రెస్ బీజేపీలకి జ్ఞానోదయం అవుతుందని భావించడం అడియాసే అవుతుందేమో!