తోటి ఎమ్మెల్యే ఆరోపణలు చేశాడు.. సాటి ఎమ్మేల్యేలు తన్ని తగలేశారు!
posted on May 31, 2017 @ 7:10PM
చెత్తనంతా ఊడ్చేస్తామంటూ చీపురు గుర్తుతో రంగంలోకి దిగిన ఆప్ మిగతా పార్టీలకంటే మరింత ఎక్కువ దుమ్మూ, ధూళిలో పొర్లాడుతోంది! పరిస్థితి చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శాల పార్టీ అత్యంత చౌకబారు రాజకీయాలకు కేరాఫ్ గా మారిపోయినట్టు అనిపిస్తోంది! ఇంతకాలం అరాచక ప్రవర్తన రోడ్ల మీదకే పరిమితమయ్యేది. కాని, ఇప్పుడు ఏకంగా జనం ఎంతో విశ్వాసంతో మెజార్టీ ఇచ్చిన దిల్లీ అసెంబ్లీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించారు. భౌతిక దాడికి దిగిపోయి తాము వచ్చిన నేపథ్యం ఏంటో నిరూపించుకున్నారు!
గత కొన్ని రోజులుగా కేజ్రీవాల్ పై కపిల్ మిశ్రా చేస్తున్న ఆరోపణల వ్యవహారం అందరికీ తెలిసిందే! నిజానికి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న కపిల్ చేసే ఆరోపణల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అసవరం లేదు. కేజ్రీవాల్ అవినీతిపరుడని చెప్పటం కోసం ఆయన రోజుకో ప్రెస్ మీట్, రోజుకో డ్రామా చేస్తున్నారు. అది ఆయన రాజకీయ వ్యూహంలో భాగం. ఆప్ అధినేతపై పగ, ప్రతీకారం! అంతే తప్ప నిజంగా కేజ్రీవాల్ మోసాల్ని బయటపెట్టడం కపిల్ మిశ్రా ఉద్దేశం కాదు. అయినా కూడా తమ మీద వస్తున్న ఆరోపణల్ని సంయమనంతో ఎదుర్కోవాల్సిన ఆప్ రౌడీలు, గూండాల ముఠాలా వ్యవహరిస్తోంది!
తమ బాస్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేసి నిరాహార దీక్షకు దిగిన మిశ్రాపై గతంలోనే ఒక ఆప్ ఎమ్మెల్యే భౌతిక దాడి చేశాడు. అయితే, ఈసారి ఏకంగా దిల్లీ అసెంబ్లీలోనే అయిదుగురు కేజ్రీవాల్ ఎమ్మెల్యేలు మిశ్రాపై స్పీకర్ ముందే దాడి చేశారు. విచిత్రంగా సదరు స్పీకర్ గారు దాడి చేసిన వార్ని సభలో వుంచి తన్నులు తిన్న మిశ్రాను మార్షల్స్ తో బయటకి గెంటేయించారు! ఇంతకీ ఆయన దాడికి గురి కావటానికి చేసిన పాపం, ఘోరం ఏంటి? కపిల్ మిశ్రా కేజ్రీవాల్ ఔషధాల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణ చేయబోయాడు! అంతే ఆప్ ఎమ్మెల్యేల చేతిలో మనోడి దవడలు వాచిపోయాయి!
కపిల్ మిశ్రాపై సభలోపల, బయట రెండు సార్లు దాడి చేసిన ఆప్ ఒక్క విషయం బాగా ఆలోచించుకోవాలి… మోదీ మొదలు అంబానీ వరకూ అందరిపైనా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశాడు! చేస్తూనే వున్నాడు! మరి కేజ్రీవాల్ పైన కూడా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు దాడులకి దిగితే? ఈ పాటికి కనీసం వెయ్యి దాడులు జరిగేవి ఆప్ అధినేత మీద! అన్ని ఆధారం లేని ఆరోపణలు చేశాడాయన! కాని, ప్రజాస్వామ్యంలో విమర్శలు, ఆరోపణలు సహజం కాబట్టి ఎవ్వరూ దాడులకి దిగలేదు! ఆ సంస్కారం రోజు నీతులు చెప్పే అవినీతి వ్యతిరేక ఆప్ పార్టీకి మాత్రం వున్నట్టు కనిపించటం లేదు!
లైవ్ అసెంబ్లీలో సాటి ఎమ్మెల్యే పై తన ప్రజా ప్రతినిధులు దాడి చేస్తుంటే కేజ్రీవాల్ ఏం చేస్తున్నారు? ఏమో! కాకపోతే, ఆల్రెడీ దిల్లీ మున్సిపల్ పోల్స్ లో దారుణమైన ఫలితాన్నిచ్నిన ఓటర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు!