అదనపు కరెంట్ బిల్లులు వసూలు చేయం: ఏపీ ట్రాన్స్ కో సీఎండీ
posted on May 6, 2020 @ 8:32PM
లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరి దగ్గర అదనపు కరెంట్ బిల్లులు వసూలు చేసే అవకాశం లేదని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు. మార్చ్, ఏప్రిల్ బిల్లులు కలిపి ఇచ్చారని అపోహ ఉందని, రెండు బిల్లులు విడిగా లెక్క కట్టామని చెప్పారు. గత ఐదు ఏళ్లగా మార్చ్ లో 46 శాతం వినియోగం, ఏప్రిల్ నెలలో 4 శాతం వినియోగం అదనంగా ఉంటుందన్నారు. అందుకే ఏప్రిల్ నెలలో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కలిపినట్లు సీఎండీ అన్నారు. రెండూ 50 శాతం, 50 శాతంగా లెక్క కట్టి బిల్లులు ఇవ్వటంతో స్లాబ్ మారే అవకాశం లేదన్నారు. ఏప్రిల్ నెలలో అదనంగా వచ్చిన యూనిట్లలను మార్చి నెలలో కలిపినట్లు ఆయన తెలిపారు. మార్చి నెలకి ఏప్రిల్ నెలకి బిల్లులు విడివిడిగా ఎస్ఎంఎస్ లు పంపుతున్నామని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను సైతం నియమించామన్నారు. ఎక్కడైనా అనుమానాలు ఉంటే 1912కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు.