వైపీపీ దాష్టికాలపై చర్యలకు నో పొలీస్!
posted on Feb 13, 2024 7:01AM
ఆంధ్రప్రదేశ్ లో అసలు పోలీసులు ఉన్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీపై విమర్శలు గుప్పించినా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదిస్తూ ఆందోళనకు దిగినా పెద్ద సంఖ్యలో ఖాఖీ యూనిఫారాలు వేసుకున్న దండు వాలిపోతుంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, వేధింపులతో చెలరేగిపోతుంది. అదే అధికార పార్టీకి చెందిన వారు ఎంత అడ్డగోలుగా వ్యవహరించినా కిమ్మనదు. పైపెచ్చు అధికార పార్టీ నేతల దాష్టీకాలకు బలైన బాధితులపైనే కేసులు నమోదు చేస్తుంది. అరెస్టులు చేస్తుంది.
ఇదంతా చూస్తుంటే.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఖాఖీ యూనిఫారంలో వైసీపీ అనుబంధ సంస్థలా మారిపోయిందా అన్న అనుమానాలు కలుగక మానవు. ఒక ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి అతడి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేస్తే.. ఆ ఎమ్మెల్సీ తనంతట తాను వచ్చి లొంగిపోయే వరకూ..బహిరంగంగా తిరిగినా అరెస్టు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు. వైసీపీ మూకలు దాడులకు తెగబడిన సందర్భాలలో ఆ దాడులకు గురైన వారిపైనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం అన్నది ఏపీ పోలీసులకు సర్వసాధారణంగా మారిపోయింది.
ఇక వైసీపీ నేతలు ఎంత అడ్డగోలుగా మాట్లాడినా, ప్రతిపక్ష నేతలను దుర్భాషలాడినా, లేపేస్తాం అంటూ హెచ్చరికలు చేసినా పోలీసులకు వినపడదు. అదే ప్రతిపక్ష నాయకులు అధికారపక్షంపై కానీ, ఆ పార్టీ నాయకులపై కానీ చిన్న పాటి విమర్శ చేసినా కేసులు, జైళ్లు. ఇదీ ఏపీలో పోలీసు వ్యవస్థ పని తీరు. సహజంగా ఎవరినైనా ఫోన్ చేసి బెదిరిస్తేనే కేసులు పెడతారు. కానీ.. ఒక బాధ్యతగల ఎమ్మెల్యే ఒక మహిళను ఉద్దేశించి ఆమె వైఎస్ బిడ్డ కాబట్టి బాపట్ల దాటనిచ్చాం. అదే వేరేవాళ్లయితేనా? అంటూ మీడియా సమావేశంలోనే బహిరంగంగా హెచ్చరిస్తే.. పోలీసులకు అందులో ఎలాంటి తప్పూ కనిపించలేదు. ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి చేతులు, చేతలు రాలేదు. అందుకు ఒకే ఒక్క కారణం ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అదే స్థానంలో ఏ విపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా అయి ఉంటే.. ఈ పాటికి కేసులు నమోదు చేసి రాజును మించిన రాజభక్తి ప్రదర్శించేవారనడంలో సందేహం లేదు.
విషయమేంటంటే.. ఇటీవల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాపట్లలో పర్యటించారు. ఆ సందర్భంగా బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి దందాలపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించి కోన మీడియా సమావేశం పెట్టి మరీ పెట్టి షర్మిలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆమె వైఎస్ బిడ్డ షర్మిల కాబట్టి బాపట్ల దాటగలిగింది. ఇంకొకరైతే వేరేలా ఉండేదంటూ హెచ్చరించారు. షర్మిల కాకుండా మరొకరైతే బాపట్లయితే దాటనిచ్చేవాడిని కాదని విస్పష్టంగానే చెప్పేశారు. దీనిపై స్పందించిన షర్మిల.. తనను హెచ్చరించిన కోనకు గట్టి రిటార్డే ఇచ్చారు. ఒ ఒక్క నిమిషానికి నేను వైఎస్ బిడ్డను కాదనుకుందాం. రండి ఎవరడొస్తారో చూద్దాం. ఎంతమంది వస్తారో చూద్దాం. మీ దమ్మేంటో చూపించండి. ఎవరేంటో చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. చెల్లి అనే ఇంగిత జ్ఞానం లేదంటూ జగన్ పైనా విరుచుకుపడ్డారు. షర్మిల ప్రతి సవాల్ సంగతి పక్కన పెడితే.. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. ఎమ్మెల్యే కోనం వ్యాఖ్యలపై పోలీసుల మౌనం.
సాధారణంగా అయితే ఈ అంశానికి సంబంధించి ఎవరైనా కోనపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయాలి. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే హెచ్చరికలో హింస ధ్వనిస్తోంది. గత ఐదేళ్లలోతెలుగుదేశం నేతలు ప్రెస్‌మీట్లలో చేసిన వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలో పోస్టింగులు, లైకులు, ఫార్వార్డు మెసేజీలు పంపిస్తేనే పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. మరి షర్మిలను హెచ్చరించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోనపై కూడా అదే విధంగా పోలీసులు సుమోటోగా ఎందుకు కేసు నమోదు చేయలేదు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. కోనకు భయపడి ఎవరూ ఫిర్యాదు చేయనంత మాత్రానా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అంశాలపై గతంలో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు, అధికార పార్టీ ఎమ్మెల్యే కనుకే కోనపై కేసు నమోదు చేయలేదు, చర్యలకు ఉపక్రమించలేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే వైసీపీ ఎమ్మెల్యే కోన హెచ్చరికలను బట్టి, వైఎస్ షర్మిలకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం మీద ఏపీలో పోలీసులు వైసీపీకి ఊడిగం చేయడమే తమ డ్యూటీ అని భావిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.