ఏపీ నూతన సీఎస్ గా జవహర్‌రెడ్డి?
posted on Nov 26, 2022 8:41AM
ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. మరో సారి సమీర్ శర్మకు ఎక్స్ టెన్షన్ కోరుతారని తొలుత అంతా భావించినా.. జగన్ నుంచి అటువంటి కదలిక ఏదీ కనిపించలేదు.
సమీర్ శర్మ పదవీ విరమణ సమయం సమీపిస్తుండటంతో ఆయనకు మరో ఏడాది పదవీ కాలం పొడగింపునకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందన్న వార్తలు వినవచ్చాయి. అయితే జగన్ సర్కార్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలే చెబుతుండటంతో సమీర్ శర్మ పదవీ కాలం పొడగింపు ఊహాగానాలకు చెక్ పడింది.
స్వయంగా సమీర్ శర్మ కూడా రిటైర్మెంట్ కే మొగ్గు చూపారనీ, ఇందుకు తన ఆరోగ్య పరిస్థితి కారణంగా చెప్పారని అంటున్నారు. దీంతో జగన్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. ఆయన పేరును నేడో రేపో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే జవహర్ రెడ్డి విషయానికి వస్తే.. జగన్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ.. జవహర్ రెడ్డి ప్రధాన లేదా కీలక పదవులలో బాధ్యతలు నిర్వహించలేదు. అయితే ఆయనకు జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎక్కడ లేని ప్రాధాన్యతా వచ్చి పడింది.
కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మొత్తం జవహర్ రెడ్డి కనుసన్నలలోనే పని చేసింది. తర్వాత ఆయన తనంత తానుగా కోరుకుని మరీ టీటీడీ చైర్మన్ పోస్టుకు వెళ్లారు. అయితే అది అతి కొద్ది కాలం మాత్రమే. తరువాత జగన్ ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెచ్చుకుని కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సీఎస్ గా ఆయన పేరునే పరిశీలిస్తున్నారు.
సమీర్ శర్మ రిటైర్మెంట్ తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీఎస్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది ప్రచారంగానే మిగిలిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ జగన్ అక్రమాస్తుల కేసులో ఆమెపై కేసులు ఆలాగే ఉండటంతో ఆమెకు అవకాశం దక్కలేదని అంటున్నారు.
ఇక, సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మకు కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్‌లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ చైర్మన్ గానూ ఆయనను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. జవహర్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.