నిమ్మగడ్డ కేసులో ఫైనల్ హియరింగ్ 28 న...
posted on Apr 20, 2020 @ 1:29PM
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఈ రోజు హై కోర్టు లో గంట సేపు వాదనలు, ప్రతి వాదనలు జరిగాయి. అడిషనల్ కౌంటర్ దాఖలు చేస్తామన్న అడ్వకేట్ జనరల్. ఈ నెల 24 లోగా అడిషనల్ కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్ట్ ఆదేశించింది. ప్రతిగా కౌంటర్ దాఖలు చెయ్యటానికి పిటిషనర్లకు 27 వరకు గడువు ఇస్తూ, ఫైనల్ హియరింగ్ 28 న ఉంటుందని హై కోర్ట్ స్పష్టం చేసింది. తేదీల విషయంలో ప్రభుత్వానికి , పిటిషనర్ల కు ఎటువంటి మినహాయింపులు ఉండవని కూడా పేర్కొంది.
ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదించడంతో బాటు మాజీ న్యాయమూర్తిని నియమించటానికి చేసిన చట్ట సవరణ ఇప్పుడు ఐ ఏ ఎస్ సర్కిల్స్ మధ్య పెద్ద అంతరానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే అడిషనల్ పిటీషన్ ప్రాధాన్యం సంతరించుకోనుంది. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ జారీ చేసిన 617, 618 జీవోలే చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీకి, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేదీకి మధ్య గ్యాప్ పెరగటానికి కారణంగా తెలుస్తోంది.
కొత్తగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్డినెన్సు చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారు. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసుకు వెళ్ల కుండా నేరుగా పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ నే జీవోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో అడిషనల్ కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడిన విషయం తెలిసిందే.