ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు
posted on Dec 29, 2020 @ 1:13PM
ఏపీలో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోపు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ముగ్గురు.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని ఆదేశించింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని వారు వివరించి చెప్పాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన వెంటనే మూడు రోజులలోపు ముగ్గురు అధికారులను ఎన్నికల కమిషన్ వద్దకు పంపాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించిన వివరాలను అధికారులు ఎన్నికల కమిషన్ కు వివరించాలని తెలిపింది. అలాగే, ఇంతవేగంగా ఎందుకు ఎన్నికలు జరపాల్సి వస్తోందో.. ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి వివరించాలని సూచించింది. ఈ చర్చలకు వేదికను ఎన్నికల కమిషన్ నిర్ణయించాలని పేర్కొంది. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.