జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. అమరావతి రైతు పాదయాత్రకు హైకోర్టు అనుమతి..
posted on Oct 29, 2021 @ 4:43PM
అంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. అమరావతి రైతుల పాదయాత్రపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అమరావతి రైతుల పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు తలపెట్టిన పాదయాత్రను రైతులు చేసుకోవచ్చని ఆదేశించింది.
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 22 నెలలుగా ఆందోళన చేస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. అందులో భాగంగానే అమరావతి నుంచి తిరుమల వరకు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అనుమతి కోరుతూ పోలీసులకు లేఖ ఇచ్చారు. అయితే అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించారు రైతులు. పాదయాత్ర అనుమతి కోసం అమరావతి రైతులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. దీంతో రైతుల పాదయాత్రకు షరతులతో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అమరావతి రైతులు. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు ప్రకటించారు.