డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు హైకోర్టు నోటీస్!
posted on Mar 2, 2020 @ 3:56PM
టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి ఘటన పట్ల హైకోర్టు సీరియస్ గా స్పందించింది. స్వయంగా హాజరు కావాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి చేయడానికి గల కారణాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. దీనిపై డీజీపీ ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసినప్పటికీ.. వ్యక్తిగతంగా హాజరు కావాలని తాజాగా ఆదేశించింది.
విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చంద్రబాబుపై కిందటి నెల 27వ తేదీన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల ఘర్షణ మధ్య చంద్రబాబునాయుడు దాడికి గురిఅయ్యారు. విమానాశ్రయం నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరకుండా అడ్డు పడ్డారు. కారుపై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లను రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసి, వెనక్కి తిప్పి పంపించారు.
ఈ మొత్తం వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని తప్పు పట్టింది. సిఎం ఆదేశాల మేరకు పోలీసులు ఇలా వ్యవహరించారని టిడిపి ఆరోపించింది. పోలీసులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. అడ్డుకున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని, తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్ 151ను చంద్రబాబుపై ప్రయోగించారని అన్నారు. 151 కింద నోటీసులు ఇచ్చి, అరెస్టు చేశారని తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై హైకోర్టు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని గతంలో పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
ఈ కౌంటర్ అఫిడవిట్‌పై సోమవారం హైకోర్టు విచారణ నిర్వహించింది. పోలీసులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, కౌంటర్ అఫిడవిట్‌లో సమగ్ర వివరాలను లేవని అభిప్రాయపడింది. అందుకే డీజీపీకి గౌతమ్ సవాంగ్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.