ఏప్రిల్ రెండో వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?
posted on Mar 31, 2021 @ 7:34PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఏప్రిల్ 17న తిరుపతి పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ముందే మరో ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పి,స్తున్నాయి. గత ఏడాది మార్చిలో కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరుపతి బైపోల్ కంటే ముందే నిర్వహించే ప్రయత్నాలు చేస్తోంది జగన్ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. గత మార్చిలో ఆగిపోయిన ఎన్నికలను వెంటనే పూర్తి చేయాలనే యోచనలో జగన్ సర్కార్ ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో అదే జోష్ లో పరిషత్ ఎన్నికలు కూడా ముగించాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. అందుకే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చింది. అయితే తన వాల్ల కాదంటూ నిమ్మగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 1న నిమ్మగడ్డ స్థానంలో కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏపీ సర్కార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఎస్ఈసీగా నీలం సాహ్నీ బాధ్యతలు తీసుకున్న వెంటనే స్థానిక ఎన్నికలపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆమె తొలి ప్రెస్ మీట్ లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ వస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1న ప్రకటన ఇచ్చి.. ఏప్రిల్ 8 లేదా 10వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.కరోనా వ్యాక్సినేషన్ కు ఈ ఎన్నికలు అడ్డంకిగా మారాయని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఏప్రిల్ మొదటివారంలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఏప్రిల్ 1న ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
2020 మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. విత్ డ్రాలు కూడా అయిపోయాయి. అప్పటికి పోలింగ్ కు వారం రోజుల ముందు కరోనా లాక్ డౌన్ తో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటన వస్తే.. 8, 10వ తేదీలు లేదా.. 12వ తేదీ లోపు ఎన్నికలు ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే నామినేషన్లు వేసిన వారు, ఏకగ్రీవంగా ఎన్నికన వారిలో కొందరు మృతి చెందడంతో ఎస్ఈసీ ప్రకటన ఎలా ఉండబోతుందనేది అసక్తికరంగా మారింది.