మండలి ఉంటుందా? ఊడుతుందా?
posted on Mar 3, 2020 @ 9:32AM
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయం లో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో టీడీపీకి ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రాజధాని విషయం, సెలక్ట్ కమిటీ తదితర విషయాలపై టీడీపీకి ఎదుర్కొనేందుకు మండలిని నిర్వహించకుండా ఉండటమే మంచిదనే భావనలో వైసీపీ ఉంది.
మరో ప్రక్క శాసన మండలిని సమావేశ పరచకుండా ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఎదుర్కోవాలో టీడీపీ ఎత్తుగడలను సిద్ధం చేసుకుంటోంది.
అసెంబ్లీ రూల్స్ ప్రకారం ప్రోరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్-కమెన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ఉన్నట్లు చెబుతున్నారు. నియమావళి ప్రకారం ఏ సభకు ఆ సభను విడి విడిగా సమావేశ పర్చవచ్చు. లేదా వాయిదా వేయవచ్చు.
కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భం గా శాసనసభనే సమావేశ పరచాలని గవర్నర్‌ను కోరే అవకాశం వుంది.
సాధారణంగా బడ్జెట్ సమావేశం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. బడ్జెట్ సమావేశాల కోసం ప్రత్యేకంగా శాసన మండలి నిర్వహించాల్సిన పనిలేదని వైసీపీ నేతలు అంటున్నారు.
అలా జరిగితే, ప్రభుత్వం శాసన సభను మాత్రమే గవర్నర్ ద్వారా సమావేశ పరిస్తే టీడీపీ కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. అయితే కోర్టు తీర్పు వచ్చేలోగా సమావేశాలు ముగిసిపోయేలా ప్రభుత్వం పథకం రచించింది. ఇరుపార్టీల నేతలు న్యాయనిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి ఏపీ శాసన మండలి పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.