లోకేష్ ను గురజాల వెళ్లి చెక్ చేసుకోమన్న పోలీస్ పెద్దాయన!
posted on Mar 14, 2020 @ 12:21PM
ఎవరో బయలుకు వెళ్లొస్తే, ఊరిపెద్ద చేతులు శుభ్రం చేసుకున్న చందాన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలకు పోలీస్ పెద్దాయన చివరకు వివరణ ఇచ్చుకుంటూ కూర్చోవలసి వస్తోంది. అసలే హైకోర్టు పిలిచి, ఆరు గంటలు నుంచో పెట్టిందని అవమానంతో ఉడికి పోతున్న గౌతమ్ సవాంగ్ కు, టీ డీ పి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కంటి లో నలుసు లా తయారయ్యారు.
శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు లేదని, లోకేష్ కు ఏమైనా అనుమానాలు ఉంటె ఓ మారు గురజాల సబ్ జైలు కు వెళ్లి చెక్ చేసుకోవచ్చునని ఆంధ్ర ప్రదేశ్ డి జి పి డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి సూచించారు..స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యానికి, శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ వారు ఫిర్యాదు ఇచ్చినా స్వీకరిస్తున్నట్టు తెలిపారు.
మాచర్ల ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ఆరోపణలపైనా సవాంగ్ స్పందించారు. మాచర్ల ఘటన తర్వాత లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వైసీపీ నాయకుడికి స్టేషన్ బెయిలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగితే ఒకసారి స్టేషన్ బెయిలు అని, మరోసారి పారిపోయాడని అంటున్నారని మండిపడ్డారు. కోర్టులు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు. లోకేశ్ విమర్శలపై స్పందించిన డీజీపీ.. మాచర్ల ఘటనలో ముగ్గురు నిందితులు జైల్లోనే ఉన్నారని డీజీపీ తెలిపారు. మాచర్ల ఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో తాము ఎవరికీ అనుకూలంగా వ్యవహరించబోమన్నారు. సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేయలేదని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు గురజాల సబ్‌జైలులో ఉన్నట్టు తెలిపారు. మాచర్ల ఘటనపై తమను విమర్శించేవారు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను తమ వాహనాల్లో ఎక్కించుకుని భద్రత కల్పించిన విషయాన్ని గుర్తించాలని డీజీపీ కోరారు.
వాస్తవానికి లోకేష్ ట్వీట్ చేస్తూ.. " వ్యవస్థల్ని బ్రష్టు పట్టించడంలో @ysjagan గారు నెంబర్ 1. తండ్రి హయాంలో తప్పుడు పనులు చేసి ఐఏఎస్ అధికారులను జైలుకి పంపారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి చివాట్లు పెట్టిస్తున్నారు," అని ప్రస్తావించడం ద్వారా సోషల్ మీడియా ద్వారా మైండ్ గేమ్ మొదలెట్టారు. సోషల్ మీడియా లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తని 14 రోజులు రిమాండ్ కి పంపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వైకాపా నాయకుడికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చాం అని ఒకసారి తూచ్ అతను పారిపోయాడు అని మరోసారి చెబుతారా, అంటూ కూడా లోకేష్ నిలదీశాడు. పొలిసు వ్యవస్థని ఇంత నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే ఈ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుందా అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, అంటూ లోకేష్ వాపోయారు.