మీడియా సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేసిన సీఐడీ డీఐజీ
posted on Nov 3, 2022 @ 4:04PM
రాష్ట్రంలో సీబీసీఐడీ సొంతంగా ఒక్క మాట కూడా మాట్లడలేని పరిస్థితి ఉందన్న విషయం తేటతెల్లమైంది. అయ్యన్న పాత్రుడు అరెస్టుపై సీఐడీ డిఐజీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన అర్దంతరంగా మీడియా సమావేశాన్ని ముగించేసి వెల్లిపోవడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.
తాను చెప్పాల్సింది, చెప్పాలనుకున్నది, అంటే ‘పై’ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారేం చెప్పమన్నారో అది చెప్పేసి.. విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెబితే ఆ ‘పై’ వారేమంటారో అన్న భయంతో మీడియా సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్టు పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించిన డీఐజీ.. ఆ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారు. తాను చెప్పదలుచుకున్న రెండు ముక్కలు చెప్పేసి విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మధ్య లోనే లేచి వెళ్లి పోయారు. అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడిని అరెస్టు చేసినట్లు చెప్పిన ఏపీ సీఐడి డిఐజీ సునీల్ నాయక్ అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్ లపై ఫిర్యాదు వచ్చిందనీ, ఆ ఫిర్యాదు మేరకే అరెస్టు చేశామని చెప్పారు. రెండు సెంట్ల భూమిని అయ్యన్న ఆక్రమించారనీ, ఆ ఆక్రమణపై నకిలీ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) తీసుకు వచ్చారనీ, ఆ ఎన్ఓసీపై సంతకం ఏఈది కాదనీ డిఐజీ తెలిపారు. ఆ కారణంగానే అయ్యన్న పాత్రుడు, విజయ్, రాజేష్ లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.
ఐపీసీ 464, 467, 471, 474, రెడ్‌విత్ 120బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కుట్ర చేసి భూమిని ఆక్రమించుకున్నారని ఏపీ సీఐడీ వెల్లడించారు. దీనిపై విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే వాటికి వేటికీ సమాధానం చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. ఎంత స్థలం కబ్జా చేశారనేది తమకు ముఖ్యం కాదని.. ఫోర్జరీ చేశారనేదే ముఖ్యమన్నారు. నిందితులు సహకరించకపోతే.. ఏ విధంగానైనా ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేయవచ్చని చట్టంలో ఉందని డీఐజీ చెప్పారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే అర్ధంతరంగా మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు.