కడప టీడీపీలో అసమ్మతి సెగలు
కడప అసెంబ్లీ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బహిరంగమయ్యాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్ల ఆమె భర్త, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్ల దేశం నాయకులు పలువురు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వారిని,ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి వైసిపి నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారు అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ దేవుని కడపలోంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారికి మంచి బుద్ది ప్రసాదించాలని అక్కడి దేవుని కడప ఆలయంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమం కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలను బట్టబయలు చేసింది. స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పట్ల, శ్రీనివాస్ రెడ్డి పట్ల వ్యతిరేకత తెలియజేస్తూ అసమ్మతి నాయకులు గుంపు కట్టడం నియోజకవర్గ తెలుగుదేశం రాజకీయాల్లో రచ్చగా మారింది. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా సీనియర్ కార్యకర్తలు,నాయకుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అది నుండి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు. ఇటీవల పార్టీల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను తొక్కేస్తుందంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
కార్యక్రమం అనంతరం కమలాపురం సీనియర్ నాయకుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిశారు. కడప నియోజవర్గ టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మురళి, కొండాసుబ్బయ్య, మహిళా నేతలు, యువ కార్యకర్తలు, నాయకులు పుత్తా నరసింహ రెడ్డి వద్ద వారి ఆవేదన వ్యక్తం చేస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.
ప్రశ్నిస్తే కేసులు పెట్టి పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆగడాలకు తట్టుకోలేకపోతున్నామని,అంబేద్కర్ రాజ్యాంగం కడపలో నడవడం లేది శ్రీనివాసరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు.
ఎమ్మెల్యే గెలుపు కోసం పోరాటం చేస్తే గెలిచాక మమ్మల్నివెలివేసిందని, వైసీపీ కార్పోరేటర్లను పార్టీలో చేర్చుకొని వారికి పెద్దపీట వేస్తున్నారని,వారి కాళ్ల దగ్గర ఉన్న వారికే పార్టీ పదవులు, ఇన్‌ఛార్జులు, పనులు కట్టబెడుతున్నారని అన్నారు.ఇంత సీనియార్టీ ఉన్న మమ్మల్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని, మా సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లండి అంటూ ఆయన్ను కోరారు. ఈ మేరకు పుత్తాకు వినతి పత్రం సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడును ,లోకేష్ బాబును కలిసే విధంగా ఏర్పాట్లు చేయాని కోరారు.