పోలవరంపై తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
posted on Jun 24, 2014 @ 10:58AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పోలవరంపై తీర్మాన౦ సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ రోజు శాసనసభ సమావేశాల్లో ఆయన పోలవరం ప్రాజెక్టుపై తీర్మానం ప్రవేశపెట్టారు. పోలవరం వల్ల గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు అందుతుందని ఆయన తెలిపారు. ఐదున్నర జిల్లాలకు నీరు అందుతుందని చెప్పారు. ముంపునకు గురైన గ్రామాలను మాత్రమే ఆంద్రలో విలీనం చేశారని, దీనిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయడం జరిగిందని చెప్పారు. అనాటి యూపిఏ ప్రభుత్వం పలు ముంపు గ్రామాలను ఏపికి ఇచ్చిందని తెలిపారు. ఆ ఆర్డినెన్స్ నే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం జరుగుతోందని అన్నారు. పార్లమెంటు సెషన్స్‌లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా తీసుకుని మూడేళ్లలో పూర్తి చేయాలని అన్నారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే అక్కడి ప్రభుత్వం పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పోలవరం తీర్మానానికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.