కరోనా తీవ్రంగా ఉన్న 30 జిల్లాలో ఏపీలోనే 7..
posted on May 7, 2021 @ 11:54AM
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ఏపీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలోని 30 జిల్లాల్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండగా.. అందులో ఏడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. ఏడు జిల్లాల్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఏపీలో ఏడు జిల్లాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. చిత్తూరు, శ్రీకాకుళం జి, తూర్పుగోదావరి , గుంటూరు , విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్ 10 జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఉండటం మరింత కలవరం కల్గిస్తోంది. పాజిటివ్ రేటు 20 శాతం దాటిన రాష్ట్రాల్లో 13వ రాష్ట్రంగా ఏపీ ఉంది. క్రియాశీలక కేసులు బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆరోది.
విశాఖ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విస్తరిస్తోంది. విశాఖ జిల్లాలో ఉన్నతాధికారులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీవోలకు కరోనా పాజిటివ్ అని తేలింది. గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ కూడా... ఈ ఏడు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందని.. అక్కడ ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకున్నారా అని ఆరా తీసినట్టు తెలుస్తోంది.
జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఏపీలో కరోనా పంజా విసురుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కరోనా కట్టడిని గాలికొదిలేసి కక్ష రాజకీయాల్లో సీఎం బిజీగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రానికి ఎ 1 వైరస్ 6093 సోకిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. జైల్లో జగన్మోహన్ రెడ్డి సంఖ్యను గుర్తు చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఎన్ 440 కె కరోనా వైరస్ కర్నూలులో బయట పడిందని చెప్పి చంద్రబాబు రాష్ట్రాన్ని అవమానపరుస్తున్నారని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రతిస్పందించారు. ‘‘దేశంలో వైరస్ ప్రమాదకరంగా ఉన్న 30 జిల్లాల్లో 7జిల్లాలు మన రాష్ట్రానివే. పాజిటివ్ రేటు 20 శాతం దాటిన రాష్ట్రాల్లో మనది 13వ రాష్ట్రం. క్రియాశీలక కేసులు బాగా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆరోది. ఆయువు నిలబడటానికి వాయువు లేదు. వైద్యం అందించే నాథుడు లేడు. అంత్యక్రియలకు శ్మశానంలో ఖాళీ లేదు. మీ వైరస్ 6093 రాష్ట్రాన్ని శవాల దిబ్బగా మార్చేసింది’’ అని అయ్యన్న ట్వీట్ చేశారు.
వైర్‌సకు... వైఎస్ కి మధ్యలో ఒక్క అక్షరమే తేడా అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ట్విటర్‌లో... ‘‘వైర్‌సను ఇంటి పేరులో పెట్టుకొన్న జగన్ రెడ్డి వైఫల్యం వల్ల ఏపీలో వైరస్ విజృంభిస్తోంది. ఫ్యాక్షన్ వైరస్ రాజారెడ్డి, పొలిటికల్ వైరస్ రాజశేఖరరెడ్డి, అవినీతి వైరస్ జగన్‌రెడ్డి. ఈ వైర్‌సలు అన్నీ నారా వ్యాక్సిన్‌తోనే అంతం అవుతాయి’’ అని జవహర్ వ్యాఖ్యానించారు.