రోజుకో మలుపు తిరుగుతున్న రజిత హత్య కేసు...

 

కీర్తి గత మూడు రోజులుగా వార్తలలో వినిపిస్తున్న పేరు. జన్మనిచ్చిన తల్లినే హత్య చేసింది. తాజాగా కీర్తి మరో ప్రియుడు బాల్ రెడ్డిని అదుపు లోకి తీసుకొని అత్యాచారం కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జనవరిలో కీర్తి పై బలవంతంగా అత్యాచారం చేశాడు బాల్ రెడ్డి. కీర్తి గర్భవతి కావడంతో మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శశి సహకారంతో అబార్షన్ చేయించాడు బాలిరెడ్డి. అయితే బాలిరెడ్డి, శశి మంచి మిత్రులని చెబుతున్నారు పోలీసులు. అబార్షన్ చేయించే సమయంలోనే శశి, కీర్తిని బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నాడు. అంతేకాదు నగ్న వీడియోలు తీసి హింసించాడు. కొంత కాలం తర్వాత కీర్తిని బాలిరెడ్డికిచ్చి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే కీర్తితో చనువుగా ఉంటూ వచ్చాడు శశి. దీంతో కీర్తిని మందలించింది రజిత. తల్లి వ్యవహారాన్ని శశికి చెప్పడంతో ఇద్దరూ కలిసి రజిత హత్యకు పథకం వేశారు. తమ ప్రేమ వ్యవహారంలో హెచ్చరించిన తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేయించింది కీర్తి. 

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతున్నాయి. ప్రియుడు శశితో కలిసి కీర్తి మద్యం సేవించిన మత్తులో తల్లిని చంపినట్లు ఒప్పుకుంది. తన తల్లి హత్యకు ప్రియుడు శిశే ప్రేరేపించాడని పోలీసుల విచారణలో తెలిపింది. తాజాగా కీర్తి ఇంట్లో మూడు బీరు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల పంతొమ్మిది న కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్ కు వెళ్లిన తల్లి రజిత ఇంటికి తిరిగి వచ్చే సరికి కీర్తి ప్రియుడు శశితో కలిసి ఉండటాన్ని చూసి ఇద్దరినీ మందలించింది. అయితే తమ ప్రేమకు అడ్డొస్తున్నదన్న రజితను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు స్కెచ్ వేశారు. ఇంటి బయట ఉన్న కారులో ప్లాన్ వేశారు. కీర్తిని ఇంటికి పంపిన శశి ఆ తర్వాత వచ్చాడు. లోపలున్న రజితను కీర్తి అరవకుండ దిండుతో ముఖంపై అదిమిపట్టగా శశి చున్నీతో గొంతు నులిమి చంపాడు.ఈ కేసు పై పూర్తి వివరాలను పోలీసులు దర్యప్తులో తేలాల్సి ఉంది.

Teluguone gnews banner