మమతా బెనర్జీపై మరోదాడి?
posted on Apr 1, 2021 8:36AM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. తృణామూల్ కాంగ్రెస్, బీజేపీ హోరోహారీగా పోరాడుతుండటంతో ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తాజాగా మరోసారి తనపై దాడి జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రత్యర్థులు జరిపిన దాడిలో గాయపడిన ఓ తృణమూల్ కార్యకర్తను కలిసేందుకు తాను వెళుతుండగా.. కొందరు వ్యక్తులు తన కారుపై దాడికి దిగారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పారు. తనను హేళన చేస్తూ దాడికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. తనపై దాడి చేసేందుకు వారికి ఎంత ధైర్యం వచ్చిందని మమత ప్రశ్నించారు. వీళ్లకు ఏ ద్రోహి ఆశ్రయం ఇచ్చాడోనని, అతను ఢిల్లీలో ఉన్నా, రాజస్థాన్ లో ఉన్నా, యూపీలో ఉన్నా బెంగాల్ కు లాక్కొస్తానని మమతా బెనర్జీ హెచ్చరించారు.
నందిగ్రామ్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్ సందర్భంగా.. ఆమెపై దాడి జరిగిందన్న వార్తలు గతంలో తీవ్ర దుమారం రేపాయి. తనపై దాడి జరిగిందని మమత ఆరోపించగా... డ్రామా చేస్తున్నారని బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. మమత కాలుకు గాయమైందని అక్కడి వైద్యులు కూడా చెప్పారు. ఈ ఘటన తర్వాచ మమత కొన్ని రోజులు వీల్ చైర్ లోనే ప్రచారం చేశారు.
మరోవైపు బెంగాల్ లో హైటెన్షన్ పుట్టిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది. టీఎంసీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. తనను సవాల్ చేసి వెళ్లిపోయిన సువేందును మట్టికరిపించాలనే పట్టుదలతో మమత ఉన్నారు. తాను పెద్ద మెజార్టీతో గెలుస్తానని సువేందు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో భాగంగా నందిగ్రామ్ తో పాటు మరో 29 నియోజక వర్గాలకుపోలింగ్ జరగనుంది. ఈ 30 స్థానాల్లో 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 75 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నందిగ్రామ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏకంగా 22 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు.