దుబారా.. బాధ్యులెవరు? వ్యవస్థ లోపాలపై వాస్తవ వేదిక లో ప్రశ్నల పిడుగులు!
సమాజం పట్ల అక్కర, బాధ్యత ఉన్న ఇద్దరు వ్యక్తులు వర్తమాన రాజకీయాలలో భ్రష్ఠత్వంపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. ఈ భ్రష్టత్వం అఖిల భారత సర్వీసు అధికారులకూ విస్తరించడాన్ని నిలదీశారు. తెలుగువన్ వాస్తవ వేదిక ద్వారా తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ వ్యవస్థ లోపాలపై విమర్శల శస్త్రాలు గుప్పించారు.
రాజకీయ నాయకుల దుబారా ఖర్చులు, ఆడంబర ప్రయాణ వ్యయాలు రాజకీయాలలో నాయకుల ఆర్థిక అరాచకత్వం చూస్తుంటే, ఆర్థిక నిబంధనలన్నవి సామాన్యులకేనా, నేతలకు వర్తించవా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇదే విషయాన్ని ‘వాస్తవ వేదిక‘ ద్వారా తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్ మరోసారి లేవనెత్తారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రభుత్వ ఖర్చుతోనే చార్టర్డ్ విమానాల్లో తిరుగుతున్నారనీ, ప్రభుత్వం దగ్గర సొంత విమానం లేనందున గంటకు 6 నుండి 8 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారన్న ప్రచారం, అలాగే విజయవాడ నుండి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే ట్రిప్పుకు 10 నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇది వ్యక్తిగత దుబారా అని విమర్శించారు. లోకేష్ తన ప్రయాణ ఖర్చులకు సొంత డబ్బులు వినియోగిస్తున్నారన్న ఆర్టీఐ వివరణ నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. ఆయన ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడం వల్ల ఆ ఖర్చు ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తోందని పేర్కొన్నారు. అయితే ఇలా ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు. ఐఏఎస్ అధికారులు నిబంధనల్లో లొసుగులను ఆసరా చేసుకుని వాటని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు ఎలక్షన్ బడ్జెట్‌తో కార్లు కొనుక్కుంటున్నారని, ఒక్కో అధికారికి మూడు నుండి ఐదు కార్లు ఉంటున్నాయనీ అన్నారు.
గతంలో కలెక్టర్లు సొంత పనులకు రిక్షాల్లో వెళ్లేవారని, కానీ ఇప్పటి అధికారులకు ఆ నిబద్ధత లేదని, వారు ఉద్యోగంలో చేరగానే విల్లాలు, అపార్ట్‌మెంట్ల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు. దుబారాకు, ఆ దుబారాకు అధికారులు పలుకుతున్న వత్తాసుకు నిలువెత్తు ఉదాహరణగా రుషికొండ ప్యాలెస్ ను చెప్పుకోవచ్చన్న వారు.. తొలుత రుషికొండ ప్యాలెస్ కు 200 కోట్ల రూపాయలు మంజూరైతే.. అది పూర్తయ్యే నాటికి మొత్తం వ్యయం 600 కోట్లకు చేరిదనీ, అంత ఖర్చు చేసీ సిఆర్జెడ్, ఎన్విరాన్మెంట్, అటవీ నిబంధనల ఉల్లంఘనా యథేచ్ఛగా జరిగిందనీ దీనిని అడ్డుకోవలసిన అధికారులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు. అదే విధంగా జగన్ హయాంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి, తీరా వేసిన తరువాత హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ రంగులను తొలగించడానికి దాదాపు ఐదువేల కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయం చేశారనీ, ఇంకా చెప్పుకుంటూ పోతే.. గతంలో విజయవాడలోని ఒక స్టార్ హోటల్ నుండి ముఖ్యమంత్రి కుటుంబం కోసం రోజుకు లక్షన్నర రూపాయల వరకు భోజన బిల్లులు ఉండేవని, ఐదేళ్లలో ఇది సుమారు 400 కోట్లు అయి ఉండవచ్చనీ పేర్కొన్నారు.
ఇక ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చలు ఇసుమంతైనా జరగడం లేదనీ, కేవలం స్వోత్కర్ష, పరనిందకే అసెంబ్లీని నేతలు వేదికగా చేసుకుంటున్నారనీ సోదాహరణంగా వివరించారు. తెలుగుదేశం, వైసీపీలు ప్రజల ముందే కొట్టుకుంటున్నట్టు కనిపిస్తాయి కానీ, అంతర్లీనంగా అవి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి ఫెన్సింగ్‌కు 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై ఎవరూ ప్రశ్నించడంలేదన్నారు. నేతల తప్పులను నిలదీయాల్సిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి నామావశిష్టంగా మిగిలాయన్నారు.
మొత్తంగా వ్యవస్థలో అలీబాబా మారాడు తప్ప, 40 మంది దొంగలు (అధికారులు, కాంట్రాక్టర్లు, దోపిడీదారులు) అలాగే ఉన్నారనీ, నాయకులు మారినా వ్యవస్థలో దోపిడీ విధానం మారలేదనీ చెప్పారు. ఇక రాష్ట్ర ఉత్పాదకత పెరిగినా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోవడానికి కారణం దుబారా, అవినీతేనన్నారు.
ఈ చర్చకు కొనసాగింపు గురువారం (జనవరి 8) రాత్రి ఏడు గంటలకు తెలుగువన్ ‘వాస్తవ వేదిక‘లో ఈ దిగువన ఉన్న లింక్ ద్వారా చూడండి.