ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ 10న
posted on Oct 3, 2024 @ 9:57AM
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా ఉచిత గ్యాస్ సిలెండర్లు, అమరావతి, పోలవరం నిర్మాణాలపై కేబినెట్ భేటీలో కీలక చర్చ జరగనుంది. కాగా కేబినెట్ భేటీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం ఇచ్చారు. అలాగే కేబినెట్ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల8వ తేదీ లోగా నిర్దేశిత నమూనాలో ప్రతిపాదనలను సాధారణ పరిపాలనా శాఖకు అందించాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.
ఇక ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకంతో పాటు పీ – 4 కార్యక్రమం అమలు వంటి అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన చెత్తపన్ను రద్దును కేబినెట్ ఆమోదిస్తుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుపైనా, డీఎస్సీ నోటిఫికేషన్ పైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.