అక్షరాస్యతలో ఆంధ్ర లాస్ట్.. ఈ పాపం ఎవరిది?
posted on Mar 26, 2021 @ 11:12AM
అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యతలో మాత్రం అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగున అథమ స్థానంలో వుంది. చివరకు బీమార్ స్టేట్ గా ముద్ర వేసుకున్న బీహార్ కంటే కూడా దిగువ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం అక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రం చిట్టచివర స్థానంలో ఉంది. ఈ సర్వే ప్రకారం ఆంధ్రలో 66.4 శాతం మంది అక్షరాస్యులు ఉండగా, బీహార్లో 70.9 శాతం ఉన్నారు. తెలంగాణలో 72.8 శాతం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 15 ఏళ్ళు దాటిన ప్రతి వంద మందిలో 38.7 మంది అక్షరం ముక్క రాని సంపూర్ణ నిరక్షరాస్యులు. అయితే ఇది ప్రస్తుత ప్రభుత్వం సొంత రికార్డ్ కాదు. గత ప్రభుత్వం అంతకు ముందున్న ఉమ్మడి రాష్ట్ర పాలకులు అందరూ బాధ్యులే. ఈ సర్వే కూడా 2017-18 విద్యా సంవత్సరానికి సంబందించిన సర్వే. అందుకే తిలా పాపం తలాపిడికెడు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినం సందర్భంగా ముఖ్యమంత్రులు సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ఇయరు, డేటుతో సహా ముహూర్తం ఖరారు చేస్తూనే ఉన్నారు. ముహూర్తాలు వచ్చిపోతూనే ఉన్నాయి కానీ, ఇంతవరకు మూడు ముళ్ళు మాత్రం పడలేదు. మరో వంక రాష్ట్రంలో అక్షరాస్యత మరింతగా దిగజారి చివరి మెట్టుకు చేరుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత 2015లో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. “2019 నాటికి రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తాం” అని ప్రకటించారు. ఆయనే 2018లో మళ్ళీ మాట తప్పకుండా, అదే వాగ్దానాన్ని అక్షరం పొల్లు పోకుండా అలాగే అప్పగించారు. అయితే (2015-2018) మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత సాధనలో ఏదైనా సాధించిందా అంటే లేదు. నిజానికి మరో మెట్టు దిగజారి ఆఖరి మెట్టుకు చేరుకుంది.
2019 సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినం సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. “వచ్చే ఐదేళ్ళలో రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధిస్తాం” అని కొత్త ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గడచిన 20నెలల కాలంలో సంపూర్ణ అక్షరాస్యత దిశగా నిర్దిష్ట చర్యలు ఏమైనా తీసుకుందా అంటే అది లేదు. చదువు పేరిట అమ్మ ఒడి, నాడు నేడు లాంటి ఓటు బ్యాంకు పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత పంతుల్ల నియామకానికి ఇవ్వడం లేదు. అంతే కాదు అమ్మ భాషకే దిక్కు లేదంటే, కిరస్తానీ భాష, ఇంగ్లీష్ ను పిల్లల నెత్తికి ఎత్తెందుకు ప్రాధమిక స్థాయి నుంచే అంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అంటూ కొత్త వివాదానికి తెర తీశారు. మరో వంక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధాన ప్రకారం ఐదవ తరగతి వరకు మాతృ భాషలోనే బోధన ఉంటుంది. దీంతో కొంత గందరగోళం నెలకొంది. మరో వంక ఇంతకు ముందే అనుకున్నట్లుగా, ఉమ్మడి ఆంధ్ర అప్రదేశ్ రాష్టంలో కూడా, ప్రభుత్వాలు ప్రాధమిక విద్యపై అంతగా శ్రద్ద పెట్టలేదు. పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురవుతూనే వుంది. ఇప్పడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. రాష్ట్రంలో అక్షరాస్యత పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అయితే ప్రవేశపెడుతున్నాయి కానీ.. చాలా వరకు పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. చివరకు నిర్బంధ ప్రాదమిక విద్య కూడా వానాకాలం చదువులానే సాగుతోంది.
మరోవైపు 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసి అక్షరాస్యతను పెంపొందించేకు గతంలో అమలైన వయోజన విద్యా పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యతలో అథమ స్థానానికి చేరింది. ఈ పరిస్థితి మారాలంటే ప్రత్యేక శ్రద్ద, చిత్తశుద్ధి అవసరం. గత ప్రభుత్వాలకు కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కానీ,లోపించినవీ లేనివీ అవే..