నవంబర్ 1నే ఏపీ ఆవిర్భావ దినోత్సవం... ఇవాళ నిర్ణయం తీసుకోనున్న ఏపీ కేబినెట్
posted on Oct 30, 2019 @ 10:25AM
ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశంకానున్న కేబినెట్... మొత్తం 30 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా నవంబర్ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని భావిస్తోన్న సీఎం జగన్... దానిపై కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి.... అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు.
అయితే, నవంబర్ 1ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రోజుని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం కూడా సరికాదంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2ని, అలాగే తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఏపీ నవంబర్ 1ని కాకుండా, మద్రాస్ నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు
అయితే, ఆంధ్రప్రదేశ్ కు మూడు తేదీలతో సంబంధముండటంతో ఏ రోజున నిర్వహించాలనేదానిపై తర్జనభర్జనలు పడిన జగన్ సర్కారు... చివరికి, 1956లో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రం విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నే ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుపుకున్నట్లే... నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కేబినెట్ ఆమోదం కేవలం లాంఛనమే. అయితే, చంద్రబాబు హయాంలో విభజన గాయాలను గుర్తుచేస్తూ జూన్ రెండున నవ నిర్మాణ దీక్షలు చేపడుతూ, రాష్ట్ర ఆవిర్భాత దినోత్సవ సంబరాలను పక్కనబెట్టారు. దాంతో ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నవంబర్ ఒకటిన ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జగన్ సర్కారు ఏర్పాటు చేస్తోంది.