ముంబైలో కరోనా ఉధృతిపై ఆనంద్ మహీంద్రా అదిరిపోయే పంచ్
posted on Feb 27, 2021 @ 10:24AM
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉంటూ ట్విట్టర్ లో తనకు నచ్చిన లేక తన దృష్టికి వచ్చిన అంశాలపై అయన తన అభిప్రాయాన్ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఒక ఫొటోను షేర్ చేస్తూ.. "ఇటీవలి కాలంలో ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దానికి కారణాలు వెతికితే... ఈ సమయంలో ఇతని క్రియేటివిటీకి ఎటువంటి పొగడ్తలూ పొందే అర్హత లేదు" అంటూ కామెంట్ చేశారు.
అయన షేర్ చేసిన ఫోటో ఒక రైలులో తీసింది. ఒకపక్క మాస్క్ లేకుండా బయటకు రావద్దని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా ఆరోగ్య శాఖ సూచనలను ఖచ్చితంగా పాటించాడు అయితే అతడు మాస్క్ ను ముక్కు, మూతికి ధరించలేదు. దర్జాగా సీటులో కూర్చుని, మాస్క్ తో కళ్లు కప్పుకుని ఏకంగా కునుకు తీస్తున్నాడు.. బాధ్యత కలిగిన వారెవరైనా మాస్క్ ముక్కు, మూతి కవర్ అయ్యేలా ధరిస్తారు. కానీ ఇతడు మాత్రం ఆ రెండు వదిలేసి కళ్ళకు మాస్క్ కప్పుకుని కునుకు తీస్తుండడం పై కొంత మంది సెటైర్లు వేస్తుండగా, మరికొందరు ఇది పూర్తి బాధ్యత రాహిత్యం అని మండి పడుతున్నారు. మరోపక్క ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది.