ఆసియా రెజ్లింగ్ లో స్వర్ణం సాధించిన భారత రెజ్లర్

 

న్యూడిల్లీ లోని కె.డి. జాదవ్ స్టేడియంలో జరిగిన 55 కిలోల విభాగంలో ఫైనల్ లో లండన్ ఒలింపియన్ భారత రెజ్లర్ అమిత్ కుమార్  ఉత్తర కొరియా రెజ్లర్ క్యోంగ్ యాంగ్ పై 1-0, 5-2 పాయింట్ల తేడాతో గెలిచి స్వర్ణం సాధించాడు. తలకి గాయమైనా లెక్కచేయకుండా ఈ ఈవెంట్ లో పాల్గొని భారత్ కు స్వర్ణం సాధించిపెట్టాడు. గతేడాది జరిగిన పోతెలలో కాంస్యంతో సరిపెట్టుకున్న అమిత్ కుమార్ ఈ సారి స్వర్ణం సాధించాడు. స్వర్ణం సాధించడంతో తొలిసారిగా ఆసియా చాంపియన్ గా నిలిచాడు.

ఫ్రం 24 టు నంబర్ వన్.. ఏపీ పంచాయతీరాజ్ పై పవన్ ముద్ర

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ శాఖపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేయడంతో అనతి కాలంలోనే ఏపీ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. చేరుకుంది.  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా  తనదైన ముద్ర వేయడం వల్లనే ఇది సాధ్యమైందని పరిశీలకులు అంటున్నారు.   ఆంధ్రప్రదేశ్  ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన కృషి ఫలితంగా ఆ శాఖలు జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాభివృద్ధి విషయంలో దేశలో  24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్ ఆ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. జాతీయ పంచాయతీ అవార్డులలో ఏపీకి నాలుగు అవార్డులు లభించాయి. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ పనితీరు విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా నిలిచింది.  

నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు.. చంద్రబాబు

రైతులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా, నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ, పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో   సమీక్ష నిర్వహించారు.  రైతులకు లబ్ధి చేకూరేలా  రబీ, ఖరీఫ్ పంటలకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.   రబీ- ఖరీఫ్- రబీ సీజన్లలో ఏయే పంటలు వేయాలి, రైతులకు ఏది ప్రయోజనం అన్న విషయాలపై వారిలో అవగాహన కల్పించాలన్నారు.  పంట ఉత్పత్తుల నాణ్యతనుపెంపుతో పాటు, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు.   దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు వాటి ప్రాసెసింగ్‌పై దృష్టి సారించడంతో పాటు,  దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేందుకు వీలుగా రైల్ కార్గో వంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యలను పరిష్కరించి, రైతులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.  ష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని అక్కడికక్కడే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్‌తో  మాట్లాడి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.   స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.  

సాగు భూములకు మాత్రమే రైతు భరోసా!

రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకం అమలు, మార్గదర్శకాలపై మంగళవారం (డిసెంబర్ 23) నిర్వహించిన సమీక్షా సమావేశంలో  మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇక నుంచి ఈ పథకం నిధులు కేవలం సాగు రైతులకు మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  గత ప్రభుత్వం విచ్చల విడిగా ఈ పథకం నిధులను సాగుకు అనుకూలంగా లేని భూములకు కూడా ఇచ్చి దుర్వినియోగం చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై అలా ఇచ్చే ప్రశక్తే లేదని పేర్కొన్నారు.  గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు బంధు పేరుతో ఉన్న ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రైతు భరోసాగా మార్చారు. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో రైతన్నలకు ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి మొత్తం ఎనిమిది వేలు చెల్లించింది. ఆ తరువాత ఈ పెట్టుబడి సాయాన్ని ఐదు వేల రూపాయలకు పెంచింది.   అయితే, ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు పొందినట్లు గుర్తించారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  రైతు భరోసాగా ఈ పథకం పేరు మార్చి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఆరు వేల రూపాయలకు పెంచింది.  అయితే ఈ పథకం ద్వారా  అనర్హులు  కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. 

అమెరికాలో 30 మంది ఇండియన్స్ అరెస్ట్.. ఎందుకంటే?

అగ్రరాజ్యం అమెరికాలో 30 మంది ఇండియన్స్ ను అమెరికా బోర్డర్ పెట్రోల్ అధికారులు అరెస్టు చేశారు. వీరంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారంటూ ఈ అరెస్టులు జరిగాయి.  కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులతో భారీ సెమీ ట్రక్ వాహనాలను నడుపుతున్నట్లు గుర్తించినందున వీరిని అరెస్టు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.   గత నెల 23 నుంచి ఈ నెల 12 వరకూ ఇంటర్ స్టేట్ హైవేలు,  ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను అదుపులోనికి తీసుకోగా, వీరిలో 30 మంది ఇండియన్స్ ఉన్నారు.  ఇండియన్  డ్రైవ‌ర్ల‌ కార‌ణంగా అమెరికాలో జ‌రిగిన‌ కొన్ని ప్రమాదాల్లో పలువురు మరణించగా, మరింత మంది తీవ్రంగా గాపడ్డారని అధికారులు తెలిపారు. సాధారణ కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులతో భారీ సెమీ ట్రక్ వాహనాలను నడపడం నేరమన్న వారు,  ప్రజల భద్రతే మా ప్రథమ లక్ష్యమన్నారు. అందుకే స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ వలసదారులను అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. 

ఆర్డనరీ బస్సులలోనూ ఏసీ.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకువెడుతోంది. సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన వనరుల నంగంలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు.  గ్రీన్ ఎనర్జీ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా చంద్రబాబునాయుడు  రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు.   పల్లె వెలుగు  బస్సులతో సహా ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో ఇప్పటి నుండి తప్పనిసరిగా ఏసీ సౌకర్యం ఉండాలన్నారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 1,450 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనుందని తెలిపారు.   పల్లె వెలుగు సహా రాష్ట్రంలోని అన్ని బస్సులలోనూ   ఇన్‌బిల్ట్ ఎయిర్ కండిషనింగ్ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పల్లె వెలుగు బస్సులు సహా ఆర్డనరీ బస్సుల ను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా అప్‌గ్రేడ్ చేయడానికి, వాటిలో కూడా ఎయిర్ కండీషన్ అమర్చడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.   

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా!

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసిరింది. ఈ నెల తొలి వార నుంచీ ప్రారంభమైన చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ రెండో వారంలోనే చలిపులి తెలుగు రాష్ట్రాలను వణికించడం మొదలైంది.  ఉదయం, రాత్రి వేళల్లో చలి గాలులకు తోడు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది.  గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి.  కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదౌతున్నాయి.  తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల   ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్‌, ఆసీఫాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో సైతం ఉష్ణాగ్రతలు భారీగా పడిపోయాయి. ఇక హైదరాబాద్‌లో సాధారణంగా 10 నుంచి 12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండగా.. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు  సింగిల్ డిజిట్ కు పడిపోయాయి.  అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో   చలి తీవ్రత అధికంగా ఉంది.   ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులతోపాటు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కోల్డ్ వేవ్ ఈ నెలాఖరువరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.  

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్

ఇస్రో మరో ఘన విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది.  శ్రీహరి కోటలోని షార్ నుంచి బాహుబలి రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.  ఎల్‌వీఎం3-ఎం6 బాహుబలి రాకెట్  అమెరికాకు చెంది భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ని నింగిలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు ఆరువేల ఒక వంద కిలోలు.  అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పెస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. బుధవారం (డిసెంబర్ 24) ఉదయం 8:54 గంటలకు ఎల్వీఎం-3 ఎం-6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను కక్ష్యలోకి పంపారు. ఈ  ప్రయోగంతో  ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్దేశిత కక్ష్యలో15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తవగానే లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇంత పెద్ద ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం ఇస్రోకి ఇదే మొదటి సారి కావడం విశేషం.

న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనల ఉల్లంఘనను ఉపేక్షించం.. సజ్జనార్ హెచ్చరిక

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.  న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు, ప్రజలు  హద్దులు దాటినా, నిబంధనలు ఉల్లంఘించినా  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  “నిబంధనలు ఉల్లంఘిస్తే న్యూఇయర్ జోష్ లేకుండా పోతుందని హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్..  న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.   క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన  భద్రతా ఏర్పాట్లపై   ఆదేశాలు జారీ చేశారు.  ప్రతి ఈవెంట్ జరిగే ప్రాంతంలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే పార్టీల నిర్వహణకు  ఆన్ లైన్ లో  పోలీస్ అనుమతిని తప్పనిసరి అని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్‌లు, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటలకే పూర్తిగా నిలిపివేయాలన్నారు. బ్ద కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  మహిళల భద్రత కోసం  15 షీ టీమ్స్ బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు.  ఈ నెల‌ 31 అర్ధరాత్రి నగరమంతటా డ్రంకెన్ డ్రైవ్‌పై  స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లుతెలిపిన సజ్జనార్  రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.  డిసెంబర్ 31 వ తేదీ రాత్రి సమయంలో నగర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామనీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం   ప్రత్యేకంగా ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబ డితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు పదివేల రూపాయలు జరిమానా విధిస్తామన్నారు.  అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్సుల  శాశ్వతం గా రద్దు చేయాలని సంబం ధిత అధికారులకు సిఫారసు చేస్తామని పేర్కొన్నారు. ఇక హోటళ్లలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు దొరికితే సంబంధిత యాజమాన్యాలపై  చర్యలు తీసుకుంటామనీ,  అలాగే అశ్లీల నృత్యాలకు అనుమతి ఇచ్చే పబ్బులు, హోటల్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనీ,  అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన పబ్బులు, హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.  

తిరుప‌తిలో గోవింద‌రాజుల‌కూ శ‌ఠ‌గోపం పెట్టారా గోవిందా?

  ఇప్ప‌టికే ల‌డ్డూ, ఆపై ప‌ర‌కామ‌ణి.. ఇప్పుడు చూస్తే తిరుప‌తి  గోవింద‌రాజ స్వామి  గోపురానికి బంగారు తాప‌డం వ్య‌వ‌హారం. గ‌త వైసీపీ జ‌మానాలో.. తిరుమ‌ల శ్రీవారి చుట్టూ ఇలా ఎన్నో వివాదాలు అల్లుకుని ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. తిరుప‌తి గోవింద‌రాజుల వారి ఆనంద నిల‌యం బంగారు తాప‌డం చేయించ‌డానికి  100 కిలోల బంగారం కేటాయించారు. మొత్తం 9 లేయ‌ర్లుండ‌గా.. వీటిలో రెండు లేయ‌ర్లు మాత్ర‌మే వాడి మిగిలిన ఏడు లేయ‌ర్ల బంగారం ప‌క్క‌దారిప‌ట్టించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.  ఇదిలా ఉంటే ఈ తాప‌డం స‌మ‌యంలో 30 పురాత‌న విగ్ర‌హాలు కూడా ధ్వంస‌మైన‌ట్టు తెలుస్తోంది. దీనంత‌టికీ కార‌ణం అన్య‌మ‌త‌స్తుల‌కు ఈ ప‌నులు అప్పగించిన‌ట్టు స‌మాచారం. దీంతో హిందూ సంఘాల వారు ఈ విష‌యంపై పెద్ద ఎత్తున ఆందోళ‌న  నిర్వ‌హిస్తున్నారు. అయితే ఇదే అంశంపై గ‌తంలో ఏఈఓగా ప‌ని చేసిన సుబ్బ‌రాజు చెప్ప‌డాన్ని బ‌ట్టీ చూస్తుంటే అలాంటిదేమీ లేద‌ని అంటున్నారాయ‌న‌. అన్య‌మ‌త‌స్తుల‌కు ప‌నులు అప్ప‌గించామ‌న్న మాట కూడా క‌రెక్టు కాదంటున్నారు. సంచ‌ల‌నం కోస‌మే  కొన్ని హిందూ సంఘాలు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు వివ‌రించారాయ‌న‌. అయితే ఈ విష‌యంపై మాట్లాడిన జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్..  ఇదంతా సంచ‌ల‌నం కోస‌మో రాజ‌కీయాల కోస‌మే చేస్తున్న పోరాటం కాదు. ఇదంతా ఆ స్వామి వారే త‌న విష‌యంలో జ‌రిగిన త‌ప్పుల‌ను తాను స‌రిదిద్దుకుంటున్నారు. ఆ మాట‌కొస్తే ఇది ఒక రాజ‌కీయ నాయ‌కులు బ‌య‌ట పెట్టిన‌దేం కాదు. ఒక సామాన్యుడి రూపంలో స్వామివారే ఇదంతా వెలుగులోకి తెచ్చార‌ని చెప్పుకొచ్చారు కిర‌ణ్ రాయ‌ల్ మేమంతా నిమిత్త మాత్రులం అని అన్నారు కిర‌ణ్ రాయ‌ల్. ఇందులో రూ. 60 కోట్ల మేర స్కామ్ జ‌రిగింద‌న‌డం క‌న్నా.. మోసం జ‌రిగింద‌ని చెప్పాల్సి ఉంటుందని అన్నారు కిర‌ణ్ రాయ‌ల్. ఈ మొత్తం వ్య‌హారం గుర్తించిన టీటీడీ విజిలెన్స్ ద‌ర్యాప్తు ప్రారంభించింది. గోపురానికి బంగారు తాప‌డంలో అవినీతి అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు తెలిస్తే ఎంత పెద్ద వారినైనా వ‌ద‌ల‌కుండా క‌ఠిన  చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు.

అత్తాపూర్‌లో హిట్ అండ్ రన్ … ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

  హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం వాహనం కారణంగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మృతుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ గుర్తిం చారు. అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తి టౌలీచౌకి పోలీస్ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఇతను తన విధులు ముగించు కుని బైక్‌పై ఇంటికి తిరిగి బయలుదేరగా టౌలీచౌకి నుంచి అత్తాపూర్ వైపు ప్రయాణి స్తున్నాడు. ఈ క్రమంలోనే అత్తాపూర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ వద్దకు రాగానే బైక్ ను వెనుక నుంచి ఒక డీసీఎం వాహనం అత్యంత వేగంగా వచ్చ ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగానికి బైక్ అదుపు తప్పగా,  డీసీఎం చక్రాల కింద పడి కానిస్టేబుల్ పడిపోవడంతో అతని పైనుండి డీసీఎం వాహనం చక్రాలు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే  డీసీఎం డ్రైవర్ ఆగకుండా వాహనంతో సహ అక్కడి నుంచి పరార య్యాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి డీసీఎం వాహనాన్ని వెంబడించారు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడిన స్థానికులు చివరకు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కానిస్టేబుల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీఎం డ్రైవర్‌పై హిట్ అండ్ రన్ కేసుతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడిపిన అభియో గాల కింద చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.