జగన్ రాజకీయాలకి జైలు అడ్డం కాదుట
posted on Apr 16, 2013 @ 12:32PM
జగన్ మోహన్ రెడ్డి మీద చంచల్ గూడా జైలుని తన పార్టీ కార్యాలయంలా మార్చేసుకొని అక్కడి నుండే పార్టీ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకూడా తోడవడంతో, అందరూ ఊహించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ఆరోపణలను చూసి బయపడలేదు. బెదిరిపోలేదు. ఖండించలేదు పైగా జైల్లోంచి రాజకీయాలు చేయకూడదని ఏ చట్టం చెపుతోంది? అని ఎదురు ప్రశ్నించేసరికి కాంగ్రెస్ తెదేపా నేతల నోట మాటలేదు.
తెగించిన వాడికి తెడ్డే ఆయుధం అన్నట్లు, అతని తప్పులను కూడా తన మాటకారితనంతో ఆ పార్టీ అధికార ప్రతినిది అంబటి రాంబాబు వెనకేసుకొని వస్తూ వితండవాదన మొదలు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి నేరం ఋజువయ్యి శిక్ష పడిన ఖైదీ కాదని, అతను కేవలం విచారణలోఉన్న ఖైదీ మాత్రమే గనుక అతనికి జైలు నుండి రాజకీయాలలో పాల్గొనే సర్వ హక్కులు కూడా ఉంటాయని ఆయన అన్నారు. విచారణలో ఉన్న ఖైదీలు రాజకీయాలలో పాల్గొనకూడదని ఏ చట్టం చెపుతోందని ఆయన ప్రశ్నించారు. చట్టంలో ఈ చిన్నపాటి విషయం గురించి తెలియకుండా కొందరు నాయకులూ పిచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేసారు. జగన్ మోహన్ రెడ్డిని ఎవరు కలవాలో, ఎప్పుడు కలవాలో నిర్ణయించుకోవలసినది ఆయనే తప్ప మొరుగుతున్న పిచ్చికుక్కలు కాదని ఆయన అన్నారు. ఆయనను కలుస్తున్న వారి గురించి అభ్యంతరాలు చెపుతున్న వాళ్ళు ఆయనకి ఆ హక్కులేదని నిరూపించామని అంబటి సవాలు కూడా విసిరారు.
దీనికి తెదేపా, కాంగ్రెస్ నేతలు ఏవిధంగా జవాబు ఇస్తారో చూడాలి. ఈ వ్యవహారం చూస్తుంటే ముదిరి పాకాన్న పడి, చివరికి ఈ విషయంపై కూడా అతనిపై మరో కేసు నమోదు అయ్యేలా ఉంది.