Read more!

సుప్రీంలో అమరావతి కేసుల విచారణ.. జగన్ సర్కార్ లో టెన్షన్

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం  (మార్చి 28) విచారించనుంది. రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్, అలాగే  స్టే ఇవ్వొద్దనీ, హైకోర్టు తీర్పునే అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని  కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ లను కూడా  జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నలతో కూడిన సుప్రీం కోర్టు  ధర్మాసనం విచారించనుంది.

కాగా అమరావతి కేసుల విచారణ త్వరిత గతిన పూర్తి చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ గతంలో చేసిన విజ్ణప్తిని అప్పట్లో సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.     గతంలో నిర్ణయించిన తేదీనే అంటే మార్చి 28నే అమరావతి పిటిషన్ల విచారణ చేపడతామని స్పష్టం చేసింది.   

అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని జగన్ సర్కార్ పదేపదే సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతోంది. ఆ క్రమంలోనే ఈ నెల  2న ఇదే అంశాన్ని  న్యాయస్థానం ముందుకు తీసుకురాగా కోర్టు నిరాకరించింది.

గతంలో చెప్పిని విధంగా ఈ నెల 28నే ఈ కేసు విచారణ చేపడతామని విస్పష్టంగా తేల్చి చెప్పింది.  హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ కు మంగళవారం కోర్టు ఏం చెబుతుందన్న విషయంలో టెన్షన్ తప్పడం లేదు.  ఇలా ఉండగా 
మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం  ఇప్పటికే  స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.