మంత్రి బొత్స కళ్ళు దొబ్బాయా అంటూ రాజధాని రైతుల తీవ్ర వ్యాఖ్యలు
posted on Oct 12, 2020 @ 1:22PM
ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత రాజధానిని అమరావతి నుండి తరలించాలని నిర్ణయించి దానికి తగినట్లుగా అసెంబ్లీలో బిల్లును కూడా పాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధానికి భూములిచ్చిన రైతులు, రైతు కూలీలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ ఆందోళనలు ప్రారంభమై 300 రోజులు పూర్తైన సందర్భంగా ప్రభుత్వ తీరుకి నిరసనగా రైతులు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా కృష్ణాయపాలెంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్, గల్లా జయదేవ్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమానికి పార్టీలకు అతీతంగా తమకు మద్దతు ఇస్తున్నందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పార్టీ పేరులో సైతం రైతు అని పెట్టుకున్న వైఎస్సాఆర్ సిపి రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ముందుగా పార్టీ పేరులో ఉన్న రైతు అనే పదం పీకేయండని రైతులు ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అమరావతిలో పండుగ చేసుకుంటున్నారని బొత్స చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆయన కళ్లు ఏమైనా దొబ్బాయా అని ఆ రైతులు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ‘‘మమ్మల్ని లకారాలతో మాట్లాడుతున్న వారు నోళ్లు అదుపులో పెట్టుకోవాలి. మేము కూడా మాట్లాడగలం.. కానీ మాకు మా పెద్దలు సంస్కారం నేర్పారు. రైతు అనే వాళ్లు లేకుంటే... మీకు భవిష్యత్తు లేదనేది గుర్తించండి. రైతులను కన్నీళ్లను పెట్టించిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జగన్ మీ మోనార్క్ పాలన ఆపకపోతే.. బుద్ధి చెబుతాం. మేము పెయిడ్ ఆర్టిస్టులమా... లేక డబ్బులు తీసుకుని మాట్లాడే మీరా... పెయిడ్ ఆర్టిస్టులు? ఆనాడు వైసీపీకి మద్దతు ఇస్తే మహిళా రైతు అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ తప్పును ప్రశ్నిస్తే.. మేము పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నామా? సీఎం జగన్ మనసు మార్చుకో.. అమరావతినే రాజధానిగా కొనసాగించు’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.