పుస్తకాల నుంచి ‘అమరావతి’ మాయం.. జగన్ సర్కారు పైత్యం!
posted on Oct 6, 2021 @ 1:08PM
‘అమరావతి’ అంటే జగన్‌రెడ్డి సర్కారుకు ఎందుకంత పగనో అర్థం కాదు. అమరావతి పేరు లేకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాజధానిని మూడు ముక్కలు చేసి.. అమరావతి వైభవాన్ని మసకబార్చేశారు. ఆంధ్రుల కలల రాజధానిలో.. స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలేలా చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలవాల్సిన అమరావతిలో.. రాజధాని రైతుల ధర్నాలు, దీక్షలు, నిరసనలు, నినాదాలు మినహా.. ఇంకేమీ లేకుండా చేస్తున్నారు. హైకోర్టు రూపంలో న్యాయం ఇంకా బతికే ఉంది కాబట్టి.. కొద్దో గొప్పో అమరావతి ఇంకా మిగిలే ఉంది. లేదంటే, ఈ వైసీపీ పాలకులు రాజధానిని ఈపాటికే నామరూపాలు లేకుండా చేసేవాళ్లు..అంటున్నారు.
తాజాగా, అమరావతి ప్రస్తావన ఉన్న పాఠ్యాంశాన్ని పాఠశాల పుస్తకాల్లో లేకుండా చేసి మరింత కక్ష్యపూరితంగా వ్యవహరించారు. పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కేవలం ఆ ఒక్క పాఠాన్ని మాత్రమే తీసేసి.. మిగతా పుస్తకమంతా అలానే కొత్తగా ముద్రించి.. ఆ పుస్తకాలను బడులకు సరఫరా చేశారు. సెలబస్ మార్చితే అనేక పాఠాలు మారాలి. కానీ, అలా చేయకుండా, కేవలం అమరావతి పాఠం ఒక్కటే తొలగించడం దారుణమని మండిపడుతున్నారు విద్యావేత్తలు. అమరావతి అభిమానులు.
2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించారు.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ ఆ అమరావతి పాఠాన్ని తొలగించి.. మిగతా 11 పాఠాలతో కొత్త పుస్తకాలు విడుదల చేసింది.
విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది విద్యాశాఖ. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు. కాకపోతే, పరీక్షల్లో అమరావతి నుంచి ప్రశ్నలు రావు. ఈ విధంగా పుస్తకాల నుంచి అమరావతి పాఠాన్ని తీసేసి.. పిల్లలు ఎవరికీ అమరావతి గురించి తెలీకుండా, అమరావతిని పరిచయం చేయకుండా.. చేయాలనే కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.