అమరావతికి వెయ్యి కోట్ల ఛాన్స్.. జగనన్న సాధించేనా?
posted on Oct 6, 2021 @ 11:23AM
అమరావతి.. ఆంధ్రుల కలల రాజధాని. 2015లో అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏపీ రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 217 చ.కి.మీ.ల విస్తీర్ణంలో అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి విజన్ తయారు చేశారు. రైతులను ఒప్పించి 30 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేశారు. అమరావతిలో రూ.40 వేల కోట్లకుపైగా అంచనాలతో టెండర్లు పిలిచారు. దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన అమరావతి నగర డిజైన్లు ఆహా అనిపించాయి. దేశంలోని ఏ మహానగరానికీ తీసిపోని విధంగా ప్రజారాజధాని అమరావతి వస్తుందని రాష్ట్ర ప్రజలు భావించారు. తమ కలల రాజధాని కల సాకారం అవుతున్నందుకు సంతోషించారు.
కాని ఆంధ్రుల ఆశలు ఎంతో కాలం నిలవలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వాళ్ల కలలు నీరుగారిపోయాయి. చంద్రబాబుకు పేరు వస్తుందన్న అసూయతోనే..మరో కారణమో కాని అమరావతిని టార్గెట్ చేసింది జగన్ రెడ్డి సర్కార్. అమరావతిలో కొనసాగుతున్న నిర్మాణాలను ఆపేసింది. దీంతో వేలాది మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి బోసిపోయింది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి రాజధాని నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. భూ సమీకరణ, రూ.10 వేల కోట్లతో చేసిన పనులు.. వేలమంది శ్రామికుల నిరంతర శ్రమ.. నిష్ఫలంగా మారిపోయాయి. ప్రస్తుతం అమరావతి స్మశానంలా కనిపిస్తోంది.
రోడ్ల పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో.. అవి ఇప్పుడు పూర్తిగా పాడైపోయాయి. రోడ్లను తవ్వి కంకర కూడా ఎత్తుకెళ్లారు దుండగులు.
అయితే ఇటీవల కాలంలో అమరావతిపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలను కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఆర్థిక కష్టాలు ఉన్నందున నిధుల కొరత వేధిస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా అమరావతి అభివృద్ధికి మరో అవకాశం వచ్చింది. రాజధాని నగర నిర్మాణానికి పదిహేనో ఆర్థికసంఘం ప్రతిపాదించిన పథకం ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఈ పథకానికి మన రాష్ట్రం నుంచి అమరావతి ఎంపికైతే... కేంద్రం నుంచి ఏకంగా రూ.వెయ్యి కోట్ల గ్రాంటు వస్తుంది.
2011 జనాభా లెక్కల ప్రకారమే పట్టణ జనాభా 35 శాతానికి పెరగడంతో మన దేశంలో ప్రణాళికాబద్ధంగా కొత్త నగరాలు నిర్మించాల్సిన అవసరాన్ని పదిహేనో ఆర్థిక సంఘం గుర్తించింది. దేశంలో 8 కొత్త నగరాలకు రూ.8 వేల కోట్లు కేటాయించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పటికే పెద్ద నగరాలున్న రాష్ట్రాలూ ఈ నిధులు దక్కించుకుని కొత్త నగరాలు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పెద్ద నగరం ఒక్కటీ లేని ఆంధ్రప్రదేశ్‌కి... అమరావతి వంటి మహానగరాన్ని నిర్మించుకోవలసిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటి నుంచీ సిద్ధమైతేనే కేంద్ర నిధుల కోసం పోటీలో నిలబడగలమని చెబుతున్నారు.
రోడ్ల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పైపులైన్ల వంటి మౌలిక వసతుల కల్పన, పాఠశాలలు, కళాశాలలకు స్థలాల కేటాయింపు వంటి సవాళ్లు... కొత్తగా నిర్మించే నగరంలో తక్కువని పదిహేనో ఆర్థిక సంఘం పేర్కొంది. గ్రీన్‌ఫీల్డ్ నగరాన్ని నిర్మించేటప్పుడు ఎదురయ్యే ప్రధానమైన సవాళ్లనూ ప్రస్తావించింది. అమరావతి వాటన్నిటినీ ఎప్పుడో అధిగమించింది. అమరావతిలో భూసేకరణ పూర్తైంది. మాస్టర్ ప్లాన్ రెడీగా ఉంది. ఎన్జీటీ సహా పలు సంస్థల అనుమతులు వచ్చాయి. కృష్ణా నది ఒడ్డునే అమరావతి ఉండటంతో జలవనరులకు ఇబ్బంది లేదు. గ్యాస్, పవర్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. అత్యంత కీలకమైన రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ అమరావతికి ఉంది. ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణకు పక్కా ప్రణాళికలు ఉన్నాయి. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ కూడా సిద్ధంగా ఉంది.
ఇలా పదిహేనో ఆర్థిక సంఘం సూచించిన అర్హతలన్ని అమరావతికి ఉన్నాయి. పూర్తిగా కొత్తగా నిర్మించే (గ్రీన్‌ఫీల్డ్) నగరాలతో పాటు, ఇప్పటికే ఉన్న నగరాల (బ్రౌన్‌ఫీల్డ్) విస్తరణకూ ఆ నిధులు ఉపయోగించుకోవచ్చని పదిహేనో ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ చెప్పారు. ఈ పథకం కింద నగరాల ఎంపిక కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2022 జనవరి 31 నాటికి నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఇందులో రాష్ట్రాల ప్రతినిధులూ సభ్యులే. పోటీలో పాల్గొనేందుకు ప్రాథమిక అర్హతల్ని కమిటీ నిర్దేశిస్తుంది. 2022 మార్చి 31 నాటికి బిడ్డింగ్ అర్హతలను నిర్ణయిస్తారు. 2022 సెప్టెంబరు 30 నుంచి బిడ్‌లు స్వీకరిస్తారు. 2022 డిసెంబరు 31 నాటికి ఎంపికైన రాష్ట్రాలను ప్రకటిస్తారు. 2023 మార్చి 31 నాటికి మొదటి దశ నిధులు విడుదల చేస్తారు. నిధులన్నీ మొదటే ఇచ్చేస్తే ప్రాజెక్టును మధ్యలో వదిలేస్తారని.. నిధులు దశలవారీగా విడుదల చేయాలని ఆర్థిక సంఘం నిర్దేశించింది.
ఆర్థిక సంఘం సూచించిన, రాజధాని నగరానికి అవసరమైన అర్హతలన్నీ అమరావతికి ఉన్నాయి. ఇప్పుడు జగన్ రెడ్డి సర్కార్ ఈ పోటీలో నిలిచి నిలవడమే మిగిలి ఉంది. అమరావతి కోసం కేంద్ర ఇవ్వనున్న వెయ్యి కోట్ల రూపాయలు సాధించడం పూర్తిగా వైసీపీ ప్రభుత్వ పనితీరుపైనే ఆధారపడి ఉంది. అమరావతికి వెయ్యి కోట్లు సాధిస్తే.. సగం పూర్తయిన రహదారులు, భవనాలను కేంద్రం ఇచ్చే నిధులతో పూర్తిచేయవచ్చు. ఈ పనులు మొదలైతే.. నిధులిచ్చేందుకు ఆర్థిక సంస్థలూ ముందుకొస్తాయి. మరీ జగన్ రెడ్డి సర్కార్ కేంద్రం నుంచి ఈ నిధులు రాబట్టానికి ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. అమరావతి అభివృద్ధిపై జగన్ సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే వెయ్యి కోట్ల నిధులను కేంద్రం నుంచి సాధించి.. పెండింగ్ పనులను పూర్తి చేయాలని అమరావతి ప్రాంత రైతులు, ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు.