‘తూర్పు’ తిరిగి దణ్ణం పెడుతున్న కూటమి బంధం?
posted on Sep 10, 2024 @ 6:04PM
కూటమి బంధం సడలుతోందా? ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ, జనసేన శ్రేణుల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా రగులుతున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తే ఔననే సమాధానమే చెప్పాలి. అసలీ విభేదాలకు బీజం గత ఏడాది ఫిబ్రవరిలోనే పడిందని చెప్పాలి. గత ఏడాది ఫిబ్రవరి 17న చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా అనపర్తి వెడుతుండగా, అప్పటి సబ్ ఇన్ స్పెక్టర్ వాసు ఆధ్వర్యంలో పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. అవరోధాలు కల్పించారు. వాహనాలను నిలిపివేశారు. దీంతో చంద్రబాబు చిమ్మ చీకట్లో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచి మరీ అనపర్తి చేరుకున్నారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రామచంద్రపురం ఎస్ఐగా వాసును కొనసాగించడం పట్ల అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాసును ఎస్ఐగా కొనసాగించే విషయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేంటంటే.. అప్పట్లో నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి తెలుగుదేశం ఇన్ చార్జిగా ఉన్నారు. ప్రస్తుత మంత్రి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ వైసీపీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో పొత్తులలో భాగంగా అనపర్తి నియోజకవర్గం బీజేపీకి కేటాయించడంతో చంద్రబాబు సూచన మేరకు నల్లమల్ల రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వాసంశెట్టి సుభాష్ వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరి రామచంద్రాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి అయ్యారు.
ఇప్పుడు ఎస్ ఐ వాసును రామచంద్రాపురంలో కొనసాగించడంపై నల్లమల్లి, వాసంశెట్టి మధ్య విభేదాలకు కారణమైంది. రామచంద్రాపురం ఎస్ఐగా నాడు చంద్రబాబును అడ్డుకున్న వాసును కొనసాగించడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు పోన్ ద్వారా తెలియజేసినా ఫలితం లేకపోవడంతో నల్లమల్లి విషయాన్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లడానికి సిద్ధమౌతున్నారు. విశేషమేమిటంటే ఈ విషయంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం నల్లమల్లికి మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తం మీద ఒక ఎస్ఐ విషయంలో తెలుగుదేశం మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటువంటి వాతావరణం తూర్పు గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉందని అంటున్నారు.