డీకేతో మల్లారెడ్డి భేటీ రేపు ప్రియాంకా గాంధీ అప్పాయింట్ మెంట్.. కాంగ్రెస్ ఎంట్రీ ఇక లాంఛనమేనా?
posted on Mar 14, 2024 @ 4:31PM
పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. కాలేజీలు పెట్టా.. సక్సెస్ అయినా. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ట్రేడ్ మార్క్ డైలాగ్. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. 2014 లో మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గొం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆయన 2016లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) గూటికి చేరిపోయారు.
అప్పటి నుంచీ బీఆర్ఎస్ లోనే కీలకంగా ఉంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడిగా మారారు. బీఆర్ ఎస్ అధికారంలో కొనసాగినన్ని రోజులు మల్లారెడ్డి హవాయే వేరు. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా వైరల్ అయ్యేది. అదే సమయంలో కబ్జాలు, భూ దందాల ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాపంకంతో మల్లారెడ్డి ఆరోపణలూ, విమర్శలకు ఖాతరు చేసేవారు కాదు.
అంతే కాదు తాను ఎవరినైనా మేనేజ్ చేయగలనంటూ ప్రకటనలు కూడా గుప్పించారు. కానీ ఇటీవలి ఎన్నికలలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి విపక్ష పాత్రకు పరిమితం కావడంతో ఆయనను ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆయన పరిస్థితి ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. ఏం చేసినా అడిగేవారు లేరన్నట్లుగా ఉండే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన కబ్జాలు, దందాలపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనపై మల్లారెడ్డి చేసిన సవాళ్ల ఫలితం ఇప్పుడు కనిపించడం మొదలైంది.
రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే మల్లారెడ్డి భూకబ్జాల వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి కాలేజీల భవనాలు నిర్మాణం చేశారని గుర్తించిన అధికారులు వాటిని కూల్చేశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అవి అక్రమ కట్టడాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలే దు. అయితే ఇప్పుడు అప్పట్లో ఫిర్యాదు చేసిన వ్యక్తే సీఎం కుర్చీలో కూర్చోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గతంలో రేవంత్ ఇచ్చిన ఫిర్యాదుకు దుమ్ముదులిపి ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేసిన భవనాలను అధికారులు దగ్గరుండి కూల్చేశారు.
మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, మా భూములను లాక్కొన్నారనీ పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫిర్యాదులపై దృష్టిసారించింది. ఈ క్రమంలో మల్లారెడ్డిపై ముప్పేట దాడిచేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్న తరుణంలో మల్లారెడ్డి అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరడానికి ప్రయత్నాలు షురూ చేశారు. ముఖ్యమంత్రితో అప్పాటింట్ మెంట్ కోసం ప్రయత్నించినా లభించకపోవడంతో ఆయన నేరుగా కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకుని అటునుంచి నరుక్కు వద్దామన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా మల్లారెడ్డి గురువారం కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.
అంత కంటే ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి పార్టీ టికెట్ ఇస్తామని పోటీ చేయాలని ప్రతిపాదించినా పోటీకి తమ కుటుంబం దూరం అంటూ బీఆర్ఎస్ తో బంధం తెంచుకోబోతున్నానన్న సంకేతాలను ఇచ్చారు. ఇప్పుడు ఇక ఏకంగా కాంగ్రెస్ గూటికి చేరేందుకు కార్యాచరణ ప్రారంభించేశారు. డీకే శివకుమార్ తో మల్లారెడ్డి భేటీ తరువాత ఆయన కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ అప్పాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. శుక్రవారం మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో ప్రియాంక గాంధీతో భేటీ అయ్యే అవకాశా లున్నాయని అంటున్నారు. దీనిని బట్టి అతి త్వరలో మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది.