అంతా ఓకే ... ఏకగ్రీవానికి లైన్ క్లియర్
posted on Mar 10, 2025 @ 11:11AM
శుభం. తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు శుభం కార్డ్ పడింది. ఐదుకు ఐదు స్థానాలు ఏకగ్రీవం అయ్యేందుకు, వీలుగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. పోటీకి అవకాశం ఉన్నా, ఎందుకనో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ, ఏకగ్రీవానికే ఓకే చెప్పాయి. నిజానికి, బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలు అటో , ఇటో తేల్చేందుకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉభయ పార్టీలకు మంచి అవకాశంగా భావిచారు. ముఖ్యంగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్, రెండవ అభ్యర్ధిని బరిలో దించి, విప్ జరీ చేస్తుందని అందరూ భావించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ వదులుకున్నాయి. ఉభయ పార్టీల మధ్య అలాంటి లోపాయికారీ ఒప్పందం కుదిరిందో ఏమో కానీ,, గప్ చిప్ గా సర్దుకు పోయారు. ఐదు సీట్లను సర్దేసుకున్నారు.
కాగా, ఎన్నికలు జరగనున్న ఐదు స్థానాల్లో, అసెంబ్లీలో ఉన్నసంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి, ఫిరాయించిన ఎమ్మెల్యేల బలంతో కలుపుకుంటే, ఖాయంగా నాలుగు స్థానాలు గెలిచే అవకాశం వుంది. కాగా, కాంగ్రెస్ నాలుగు స్థానాలలో ఒక స్థానాన్ని మిత్ర పక్షం సిపిఐకి వదిలి, మిగిలిన మూడు స్థానాలకు తమ అభ్యర్ధులను నిలిపింది. మరో వంక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎగ్గులకు పోకుండా, ఖాయంగా గెలిచే ఒక్క సీటుకే పరిమితం అయింది. మూడు పార్టీలూ అభ్యర్ధులను ప్రకటించాయి.
కాంగ్రెస్ పార్టీ, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, విశ్వసనీయత, విశ్వాసాలకు పెద్ద పీట వేస్తూ, ఎస్సీఎస్టీ, మహిళ కు టికెట్లు ఇచ్చింది. పార్టీ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో, విశ్వసనీయంగా పనిచేస్తున్న అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర నాయక్తో పాటుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎంపీ విజయశాంతికి టికెట్ ఇచ్చింది.అలాగే బీఆర్ఎస్ కూడా చట్ట సభలో సీటు కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న దాసోజు శ్రవణ్ కు టికెట్ ఇచ్చింది. పార్టీలు వేరైనా, దయాకర్, శ్రవణ్ మధ్య ఒక సారూప్యత కూడా వుంది. ఇద్దరికీ చట్ట సభల ఎంట్రీ పాస్ చిక్కినట్లే చిక్కి చేజారి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరికీ ఒకేసారి చట్టసభలో ప్రవేశించే అవకాశం రావడం యాదృచ్చికమే అయినా, ఆసక్తిని రేకేతిస్తున్నది. అలాగే ఆ ఇద్దరి విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండక పోవచ్చును. ఇద్దరూ డాక్టరేట్ పట్ట పొందిన విద్యా వంతులు, ఉద్యమ నేపధ్యం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, అలా ఎలా చూసినా పెద్దల సభకు అన్నివిధాలు అర్హులు. అందులో సందేహం లేదు.
అలాగే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నా సిపిఐ కి పొత్తు ఒప్పందంలో భాగంగా దక్కిన ఎమ్మెల్సీ సీటుకు నల్గొండ జిల్లా కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లికంటి సత్యంకు టికెట్ ఇచ్చింది. కాగా కాంగ్రెస్ కోటాలో టికెట్ దక్కించుకున్న నలుగురిలో ముగ్గురు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారు కావడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ తొలి సారిగా ఓసీలను కాదని ఎస్సీ ఎస్టీ, బీసీ మహిళకు టికెట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకిస్తోంది. అలాగే బీఆర్ఎస్, సిపిఐ కూడా, బీసీలకు టికెట్, ఇవ్వడం ఒక విధంగా రాష్ట్రంలో మారుతున్న సామాజిక ప్రాధాన్యతలకు నిదర్శనంగా భావిస్తున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాల ప్రభావం అన్ని పార్టీల మీద ఉందనేందుకు ఏ ఒక్క పార్టీ కూడా, ముఖ్యంగా నల్గొండ నుంచి అభ్యర్ధులను బరిలో దించిన కాంగ్రెస్, సిపిఐ పార్టీలు రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టికెట్లు ఇవ్వడం రాజకీయ సామాజిక సమీకరణాలలో వస్తున్న మార్పుకు సంకేతంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే, మొత్తం ఐదుగురిలో నలుగురు ఒకే జిల్లాకి చెందినా వారు కావడం కూడా బాహుశా ఇదే ప్రప్రథమం కావచ్చును.
అదొకటి అలా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసి అధ్యక్షుడు మహేశ కుమార్ గౌడ్ సహా రాష్ట్ర నాయకులను సిఫార్సులకు మాత్రమే పరిమితం చేసిందనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజం వుందో లేదో కానీ, ఫైనల్ స్కృటినీ, చివరి వడపోత సమయంలో రాష్ట్ర నాయకులు ఎవరూ ఢిల్లీలో లేరు. నిజానికి ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం, అధిష్టానం ఆదేశం మేరకు చివరి నిముషంలో రద్దయింది. దీని బట్టి చూస్తే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకులకు, గీత దాటద్దని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతోందని అంటున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియామకం అనతరం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని పెట్టిందనే వాదనకు, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనుసరించిన, ప్రక్రియ అద్దం పడుతొందని అంటున్నారు. ఈ నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపికలో, ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు, జానా రెడ్డికి, అధిష్టానం ఇచ్చిన ప్రధాన్యత దృష్ట్యా, ముందు ముందు మరిన్ని సంచలన నిర్ణయాలు, ‘ముఖ్య’ మైన మార్పులు ఉన్నా ఉండవచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.
మొత్తంగా చూస్తే, తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా నిలిచిన, మిలియన్ మార్చ్’ జరిగిన, మార్చి 10 (2011) రోజున, తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్, విజయశాంతి పెద్దల సభకు నామినేషన్ వేయడం ... వారి ఏకగ్రీవ ఎన్నిక ఇంచుమించుగా ఖరారు కావడం ఒక విధంగా స్వాగతించదగిన పరిణామంగా ఉద్యమ నాయకులు పేర్కొంటున్నారు.