అక్కడా.. ఇక్కడా.. రెండు చోట్లానా?.. గజ్వేల్, కామారెడ్డిపై సర్వత్రా ఉత్కంఠ!
posted on Nov 8, 2023 @ 10:33AM
తెలంగాణ ముఖ్యమంత్రి గజ్వేల్ తో పాటు మరో నియోజకవర్గం కామారెడ్డి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుచుంటున్నట్లు ప్రకటించిన క్షణం నుంచే ఆయన గజ్వేల్ లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలోనూ, రాజకీయ వర్గాలలోనూ బలంగా వ్యక్తమయ్యాయి. కామారెడ్డి ప్రజలు కోరినందునే అక్కడ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించినా ఆ అనుమానాలు నివృత్తి కాలేదు. అది వేరే సంగతి ఇక ప్రస్తుతానికి వస్తే.. కేసీఆర్ కు గజ్వేల్ లోనూ, కామారెడ్డిలోనూ కూడా గట్టి పోటీయే ఎదురైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గజ్వేల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయనకు గట్టి ప్రత్యర్థి అని అంటున్నారు. అలాగే కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారని అంటున్నారు.
దీంతో కేసీఆర్ పరిస్థితి నిన్నటి దాకా ఒక లెక్క..ఇక నుంచీ మరో లెక్క అన్నట్లుగా తయారైంది. ఎన్నికల వ్యూహాలలోనూ ఎత్తుగడలలోనూ తిరుగులేదని ఇంత కాలం కేసీఆర్ విషయంలో ఆయన ప్రత్యర్థులు కూడా చెబుతూ ఉండేవారు. అయితే ఈ సారి ఎన్నికలలో మాత్రం ఆయనకే అందనంత వేగంగా కాంగ్రెస్ వ్యూహాలు ఉంటున్నాయి. ఆయన ఒక అడుగు వేసే లోగా రేవంత్ సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మూడడుగులు వేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ కూడా వ్యూహాత్మకంగా గజ్వేల్ నుంచి ఈటలను రంగంలోకి దింపడంతో రెండు చోట్లూ కూడా కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అనివార్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సారి ఎన్నికలలో ఆయన రెండు నియోజకవర్గాలలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటుండటంతో.. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలపై పూర్తిగా కాన్సన్ ట్రేట్ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
ముందుగా గజ్వేల్ నియోజవకర్గం తీసుకుంటే.. ఇక్కడ ఈటల సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో అడుగు కలిపి నడిచిన ఈటల ఈ తరువాత కేసీఆర్ సర్కార్ లో రెండు సార్లూ కూడా కీలక పదవులను నిర్వహించారు. ఈటలను మంత్రిపదవి నుంచి తప్పించిన తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ పన్నని వ్యూహం లేదు. ఆ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందు నెలల నుంచే మొత్తం పార్టీని అక్కడ మోహరించిన కేసీఆర్ ఈటల ఓటమికి పావులు కదిపారు. వ్యూహాలు రచించారు. అయితే ఈటల వాటన్నిటినీ తిప్పి కొట్టారు.
మంత్రులూ, ఎమ్మెల్యేలూ సీనియర్ నాయకులూ అంతా హుజూరాబాద్ లోనే తిష్ట వేసి ఈటల ఓటమి కోసం పని చేసినా ఫలితం లేకపోయింది. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. దీంతో అప్పట్లో ఆ గెలుపు ఈటల విజయం కంటే.. కేసీఆర్ ఓటమిగానే పరిశీలకులు అభివర్ణించారు. ఇప్పుడు అదే ఈటల గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రత్యర్థిగా నిలబడ్డారు. దీంతో హుజూరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇక్కడ రేవంత్ పోటీ కేసీఆర్ ను ఎందుకు గాభరాపెడుతోందో తెలుసుకోవాలంటే.. ముందుగా ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉందే. నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ ను జైలుకు పంపిన సందర్భంలోనే రేవంత్ కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యమని ప్రతిన పూనారు. ఒక నాయకుడు ప్రతిన పూనినంత మాత్రాన కేసీఆర్ లాంటి బలమైన నేత కంగారుపడతారా అన్న అనుమానం రావచ్చు. కానీ తెలంగాణలో రేవంత్ బలమైన నాయకుడిగా ఎదిగారు. వరుసగా రెండు ఎన్నికలతో డీలాపడిన, అంతర్గత కుమ్ములాటలూ, వలసలతో రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కూడగట్టడమే కాకుండా, పూర్వవైభవం సంతరించుకోవడం తథ్యమని పార్టీ శ్రేణులలో విశ్వాసం కలిగేలా చేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రం కాంగ్రెస్ రేవంత్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందు ఉనికి కోసం పాకులాడుతున్న పార్టీగా ఉండేది. కానీ ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత మాత్రం అధికారానికి ఉరకలేసే స్థాయికి పెంచారు. పార్టీలో అంతర్గత కలహాలను నివారించారు. అసంతృప్తి జ్వాలలను చల్లార్చారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డిలో రేవంత్ పోటీతో కేసీఆర్ విజయం నల్లేరుమీద బండి నడక అయితే కాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఫలితం ఎలా ఉండబోతోందన్న దానిపై భారీ స్థాయిలో బెట్టింగులు కూడా మొదలైనట్లు చెబుతున్నారు. కేసీఆర్ రెండు చోట్లా గెలుస్తారా.. లేక ఒక చోటా.. లేక రెండు స్థానాలలోనూ ప్రతికూల ఫలితం వస్తుందా? అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది.