అక్కినేనికి ఆపరేషను
posted on Oct 21, 2013 @ 4:24PM
తెలుగు చిత్ర పరిశ్రమలో కురువృద్దుడని పేరొందిన దాదాఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వరరావు ఇటీవలే తన తొంబైలలో అడుగుపెట్టారు. అయినప్పటికీ తానూ ఎవ్వర్ గ్రీన్ అంటూ కొడుకు, మనమడితో కలిసి ‘మనం’ అనే సినిమాలో నటిస్తున్నారు. అచంచలమయిన ఆత్మవిశ్వాసం, పరిపూర్ణమయిన జీవితం స్వంతం చేసుకొన్నందునే ఆయన ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇంత వయసు మీదపడినా కూడా అది తన శరీరానికే తప్ప మనసుకి కాదని చెపుతూ నేటికీ చురుకుగా తన సినీ ప్రస్తానం కొనసాగించ గలుగుతున్నారు. అయితే, మూడు నాలుగు రోజుల క్రితమే తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని అయితే అది ఇంకా ప్రాధమిక స్థాయిలోనే ఉందని, దానిని కూడా దైర్యంగా ఎదుర్కొని సెంచరీ పూర్తి చేస్తానని, ఆయన పూర్తి ఆత్మవిశ్వాసంతో మీడియాను పిలిచి మరీ చెప్పారు.
అయితే మొన్న శనివారంనాడు ఆయన ఆహారం తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది కలుగుతోందని చెప్పగానే కుటుంబసభ్యులు ఆయనను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు క్యాన్సర్ సోకిన ఆయన చిన్న ప్రేగులలో ఏర్పడిన చిన్నకణితి వంటి పదార్ధాన్నిఅదేరోజు ఆపరేషన్ చేసి తొలగించివేసారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని కంగారు పడవలసిందేమీ లేదని కిమ్స్ యండీ. డా. డీ.భాస్కర్ రావు తెలియజేసారు. త్వరలో ల్యాబ్ రిపోర్ట్ రాగానే ఆయనకు ఎటువంటి వైద్యం అందించాలో చెప్పగలమని ఆయన అన్నారు.
ఏమయినప్పటికీ, నాగేశ్వరరావుగారి ఆత్మవిశ్వాసం ముందు క్యాన్సర్ కూడా ఓడిపోక తప్పదని ఆయన త్వరలోనే ఋజువు చేయడం ఖాయం. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలలో నటించాలని కోరుకొందాము.