అఖిలేష్ యాదవ్... క్రికెట్ ఆడినా గెలవాల్సిందే!
posted on Mar 21, 2016 @ 5:39PM
సాధారణంగా IAS ఆఫీసర్లు ప్రభుత్వం పట్ల విధేయతగా ఉంటారని ఓ నమ్మకం. అందులోనూ ఉత్తర్‌ప్రదేశ్‌లో పరిస్థితులు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకు ఉదాహరణగా జరిగిన ఓ విషయం గురించి మాత్రం ఇక్కడ చెప్పుకోవచ్చు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికీ, అక్కడి IASలకీ మధ్య ఒక స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ జరిగింది. సాధారణంగా ఇలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఎంత స్నేహపూర్వకంగా జరిగినా కానీ, ప్రత్యర్థి జట్టు కాస్తో కూస్తో పోటీ ఇస్తుంది. కానీ ప్రత్యర్థిగా అఖిలేష్ జట్టు ఉంటే! అందుకనే అఖిలేష్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు వీలైనంత నిదానంగా బౌలింగ్ చేశారంట ప్రత్యర్థులు. దాంతో అఖిలేష్ ఏకంగా 11 ఫోర్లూ, ఓ సిక్సరూ బాదేసి 65 పరుగులు సాధించారు.
ఇంతచేసినా ఆయన జట్టు 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనికి IAS జట్టు మొదట్లో దీటుగానే జవాబిచ్చింది. ఇంకో రెండు ఓవర్లలో కేవలం మూడంటే మూడే పరుగులు సాధిస్తే ఇక ఆ జట్టు గెలిచినట్లే! కానీ తాము బాగా ఆడుతున్నామని ఆ జట్టుకి గుర్తుకొచ్చినట్లుంది. అనూహ్యంగా ఆ జట్టు ఆ మూడంటే మూడు పరుగులు చేయలేక... టపటపా... పటపటా వికెట్లను కోల్పోయింది. దాంతో అఖిలేష్ జట్టు వరుసగా నాలుగో ఏడు కూడా ఈ టి-20 స్నేహపూర్వక పోటీలో విజయం సాధించింది. అఖిలేష్‌కి నాలుగో ఏడు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మున్ముందు కూడా తాము ప్రత్యర్థి జట్టు నుంచి ఇలాంటి సహకారాన్నే ఆశిస్తున్నామని, మ్యాచ్ ముగింపు సందర్భంగా అఖిలేష్ పేర్కొన్నారు!!!