ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం
posted on May 4, 2025 @ 2:41PM
భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకు ముందు రోజే నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠీ కూడా ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇక, ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ను భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తున్న విషయం తెలిసిందే. విడతల వారీగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తోందనని పాక్ వణికిపోతోంది. మరోవైపు, భారత్ చర్యలపై ప్రధాని మోదీ వరుసగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్‌తో భేటీ అయ్యారు. శనివారం నాడు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కూడా మోదీ సమావేశమైన విషయం తెలిసిందే. అలాగే ఉగ్రదాడి నేపథ్యంలోనే భద్రతా వ్యవహారాల మంత్రి వర్గ కమిటీ సమావేశం జరిగింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు ఈ సమావేశంలో కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇక శుక్రవారం నాడు యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలను నిర్వహించింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ వాయుసేన పాక్‌లోకి ప్రవేశించి దాడి చేసింది. నాటితో పోల్చుకొంటే రఫెల్ యుద్ధ విమానాలు, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో ఐఏఎఫ్ శక్తి గణనీయంగా పెరిగింది.