మోదీ, అమిత్ షాలది దూకుడా? దుర్మార్గమా?
posted on Jul 30, 2017 @ 11:35AM
బీజేపి ఇప్పుడు దావానలంలా మారిపోయింది! ముప్పై ఏళ్ల కింద ఒకట్రెండు ఎంపీ సీట్లతో మొదలైన ఒక చిన్న నిప్పు రవ్వ ఇవాళ్ల దేశంలో ప్రతిపక్షాలన్నిటికీ సెగ చూపుతోంది! కాంగ్రెస్ మొదలు తృణమూల్ కాంగ్రెస్ వరకూ అన్ని పైపైకి ఒప్పుకోకున్నా గడగడ వణకుతున్నాయి కాషాయ కార్చిచ్చును చూసి! ఒకవైపు యూపీ లాంటి అతి పెద్ద రాష్ట్రంలో స్వంతంగా అధికారంలో వచ్చారు కమలనాథులు. మరో వైపు మణిపూర్, గోవా లాంటి రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు రాకున్నా పంతం నెగ్గించుకుని పెత్తనం దక్కించుకున్నారు. ఇక తాజాగా బీహార్లో నితీష్ చేత రాజీనామా చేయించి లాలూని, రాహుల్ గాంధీని క్లీన్ బౌల్డ్ చేశారు! ఆ షాక్ నుంచి రాజకీయ నేతలు కాదు… మీడియూ కూడా తేరుకునేలోపే గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల్ని టార్గెట్ చేశారు!
లాలూ, అతడి కొడుకు అవినీతిని చూపించి బీహార్ మహాఘట్భందన్ ముక్కలు చేయించిన మోదీ, అమిత్ షా పెద్ద చర్చకు తెర తీశారు. ఇలా అప్రజాస్వామికంగా , ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్రాల్ని కైవసం చేసుకోటం సబబేనా అన్నది ఆ డిస్కషన్ సారాంశం! అరుణాచల్ ప్రదేశ్ మొదలు తమిళనాడు దాకా ఏ రాష్ట్రాన్ని, ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీని బీజేపి వదలటం లేదు. అందర్నీ, అంతటా టార్గెట్ చేసి అధికారం చేజిక్కించుకుంటోంది. ఇది బీజేపి అభిమానులకి, కరుడుగట్టిన హిందూత్వవాదులకి సంతోషం ఇస్తుందేమో కాని ప్రజాస్వామ్య విలువలు ఆశించే వార్ని కృంగదీస్తుంది! బీజేపి కూడా ఇతర ఫక్తు పొలిటికల్ పార్టీల మాదిరిగానే ప్రవర్తిస్తోందని అనిపిస్తుంది…
బీహార్ తరువాత తన సహజమైన అధికార కేంద్రమైన గుజరాత్ మీద దృష్టి పెట్టింది కాషాయ పార్టీ! మోదీ, అమిత్ షా ఇద్దరూ ఆ రాష్ట్రం వారే! వచ్చే కొన్ని నెలల్లోనే అక్కడ ఎన్నికలున్నాయి. అయితే, కాంగ్రెస్ గత రెండు దశాబ్దాలుగా అక్కడ గెలిచింది లేదు. రాబోయే ఎన్నికల్లోనూ గెలచి సూచనలు లేవు. అయినా, మోదీ, షా హస్తాన్ని పూర్తిగా విరిచి పారేయాలని నిర్ణయించారు. సోనియాకు అత్యంత ఆప్తుడైన అహ్మద్ పటేల్ ను రాజ్యసభకు కూడా రానీయకుండా ఎమ్మెల్యేల్ని దారిలోకి తెచ్చుకుంటున్నారు. మొదట శంకర్ సింగ్ వాఘేలాను కాంగ్రెస్ నుంచి బయటకు తెచ్చిన మోదీ, షా అతడి వెంటే అనేక మంది కాంగ్రెస్ ఎమ్మేల్యేని లాక్కొచ్చారు. వారి చేత ఏకంగా రాజీనామాలే చేయించారు. ఊపిరాడని కాంగ్రెస్ బెంగుళూరులో తమ మిగిలిన ఎమ్మెల్యేల్ని దాచి పెట్టుకోవాల్సి వచ్చింది! అయినా కూడా ఆగస్ట్ 8న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలిచే సంకేతాలేం కనిపించటం లేదు. సోనియాకి అత్యంత ఆప్తుడు, గుజరాత్ లో అందరికంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన అహ్మద్ ఓడిపోతే … రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు!
గుజరాత్ లో కాంగ్రెస్ పరిస్థితే యూపీలో ఎస్పీకి కూడా పట్టింది. అచ్చు కాంగ్రెస్ లాగే ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయించే సమాజ్ వాదిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వుంది! అమిత్ షా లక్నోకి రావటానికి సరిగ్గా రెండు గంటల ముందు ఇద్దరు ఎస్పీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అందులో ఒకరు షియా మైనార్టీ వర్గానికి చెందిన వారు! ఇద్దరూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై , మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపుగా తాము బీజేపీలో చేరబోతున్నట్టు చెప్పకనే చెప్పారు!
లూలూ పార్టీలో అవినీతి, కాంగ్రెస్ లో గాంధీల పాలన, సమాజ్ వాదిలో యాదవ్ ల కల్లోలం… ఇలాంటివి బీజేపికి కలిసి వచ్చిన అంశాలు. అందుకే, వాట్ని వాడుకుని ఆయా పార్టీలతో ఓ ఆటాడుకుంటోంది కమలం! కాని, గతంలో కాంగ్రెస్ కూడా ఇలానే అరాచక వ్యూహాలు పన్నిందని , ఇతర పార్టీల్ని వేటాడి ఆనందం పొందిందని అంటున్నారు విశ్లేషకులు. బీజేపి కూడా ప్రస్తుతం వున్న బలాన్ని చూసి గర్వించకుండా వుండాలని సూచిస్తున్నారు. నిజంగా కూడా… అప్రజాస్వామిక ఎత్తులకు, పైఎత్తులకి పోకపోవటమే దీర్ఘ కాలంలో మంచిది. కాషాయ పెద్దలు ఈ సత్యం గుర్తిస్తే ఎందుకైనా మంచిది!