ఉక్కు పోరు.. 22న సీఎంవో ముట్టడి
posted on Aug 14, 2024 @ 2:53PM
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మళ్లీ అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు పరం చేయబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖ వచ్చి మరీ విస్పష్ట హామీ ఇచ్చినా, కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మాత్రం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మళ్లీ ఆందోళన బాట పట్టింది
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకోవడానికి మళ్లీ పోరు మొదలైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ వచ్చి మరీ హామీ ఇచ్చి వారాలు గడిచిపోతున్నా ఆ దిశగా చిన్న పాటి అడుగు కూడా పడకపోవడం పట్ల విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. నోటితో చెప్పి నొసటితో వెక్కిరించిన చందంగా కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తున్నది. విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయబోమని స్పష్టమైన హామీ ఇచ్చారనీ, అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పోరాట కమిటీ ఆరోపిస్తున్నది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కృత్రిమంగా ముడి సరుకు కొరత తీసుకువచ్చి ప్లాంట్ ను మూసేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నది. ఇందుకు ఉదాహరణగా విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ముడి సరుకు కొరత ఎదుర్కొంటున్నా.. గంగవరం పోర్టులో లక్ష టన్నల ముడి సరుకు ఉన్నప్పటికీ కేంద్రం దానిని విశాఖ స్టీల్ ప్లాంట్ కు పంపడం లేదని పోరాట కమిటీ ఆరోపిస్తున్నది. కేంద్రం తీరును చూస్తుంటే దశలవారీగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసివేసే దిశగా అడుగులు వేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పోరాట కమిటి ఆరోపిస్తోంది. నష్టాల సాకు చూపి స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూసేసే ఉద్దేశంలో కేంద్రం ఉందని పేర్కొంటూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 22న సీఎం కార్యాలయ ముట్టడికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు నిచ్చింది.