టీఆర్ఎస్ కీలక నేతకు బిగిస్తున్న ఉచ్చు ?
posted on Feb 19, 2021 @ 10:02AM
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. పోలీసుల విచారణలో కొత్త వ్యక్తుల పేర్లు బయటికి వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కీలక నేత ,మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. ఆ నేత మేనల్లుడి పాత్ర తెరపైకి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
వామన్ రావును హత్య కోసం మూడ్రోజుల ముందే పథక రచన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరిన్ని సాక్ష్యాధారాల కోసం గుంజపడుగులో బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంటశ్రీను ఏ1, ఏ2గా చిరంజీవి, ఏ3గా కుమార్ నిందితులుగా ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జెడ్పీచైర్మన్ , మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరు తెరపైకి వచ్చింది. వామన్ రావు హత్య జరగడానికి ముందు కుంట శ్రీను 25సార్లు అతనితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాదు వామనరావు దంపతులను హత్య చేయడానికి అవసరమైన కారు, కత్తులను జెడ్పీచైర్మన్ మేనల్లుడే అందించాడని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిట్టు శ్రీను పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు.
గుంజపడుగు శివాలయం చైర్మన్ పదవిలో గత కొన్నేళ్లుగా వామన్ రావు బంధువు కొనసాగుతున్నారు. ఆ పదవికోసం కుంట శ్రీను ప్రయత్నాలు చేయడంతో వివాదం ఉందంటున్నారు. అక్రమ క్వారీ వల్ల పుట్టమధు రూ.కోట్లు గడించాడని వామన్ రావు పలుమార్లు పిటిషన్స్ వేశాడు. ఈ రెండు ఘటనలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. తన మేనల్లుడి పేరు తెరమీదకు రావడంపై జెడ్పీ చైర్మన్ పుట్టమధు ఇంకా స్పందించలేదు. మరోవైపు లాయర్ వామనరావు దంపతుల హత్య ఘటన పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారిందనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కుంట శ్రీనను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా.. పుట్ట మధుపైనా వేటు వేసే యోచనలో గులాబీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది.