ఆధార్ లింక్డ్ టీష‌ర్టులెక్క‌డైనా చూశారా!?

ఒక‌డే ఒక్క‌డు మొన‌గాడు.. ఊరే మెచ్చిన ప‌నివాడు.. అన్న ముత్తు సినిమాలోని  పాట వినే ఉంటాం. అయితే ఇక్క‌డ అంద‌రూ మొన‌గాళ్లే. అంద‌రూ ప‌నివాళ్లే.. కావాలంటే ఈ ఆధార్ ముద్రిత టీష‌ర్టును చూడండీ.. మీకిట్టే తెలిసిపోతుంది.

అరే ఇదేదో భ‌లేగుందే.. అని మీకూ అనిపించింది కదూ.. అయితే మీరీ స్టోరీ త‌ప్ప‌క తెలుసుకోవ‌ల్సిందే. ఏపీలోని అన‌కాప‌ల్లి జిల్లా న‌క్క‌ల‌ప‌ల్లి మండ‌లంలోని.. రాజ‌య్య పేట గ్రామంలో బ‌ల్క్ డ్ర‌గ్ ఫ్యాక్ట‌రీ వ్య‌తిరేక ఉద్యమం జ‌రుగుతోంది. మొన్నామ‌ధ్య వీరు హోం మంత్రి అనిత‌ను అట‌కాయించ‌డంతో పాటు.. జిల్లా క‌లెక్ట‌ర్ని సైతం త‌మ ఊరికే ర‌ప్పించిన ఘ‌నులు. 

అయితే ఈ గ్రామ ఆందోళ‌న‌కారులు.. త‌మ ఊరిలోకి మ‌రెవ‌రూ రాకూడ‌ద‌న్న నిబంధ‌న పెట్టుకున్నారు. అంటే ఈ గ్రామ ఉద్య‌మంలో మ‌రే ఇత‌ర అసాంఘిక, రాజ‌కీయ శ‌క్తులు లోప‌ల‌కు రాకూడ‌ద‌నుకున్నారో ఏమో.. మా మూమెంట్ ఎక్స్ క్లూజివ్ అన్న ముద్ర వేయాల‌నే అనుకున్నారో తెలీదు గానీ,  ఒక రూలైతే పెట్టుకున్నారు. 

అంతా బాగుంది కానీ.. ప్ర‌తి సారీ వీడు మ‌నూరోడూ.. వీడు మ‌నూరోడు కాడ‌ని ఎలా తెలుసుకోవ‌డం?.. అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. అరెరే పెద్ద చిక్కే వ‌చ్చిందే అని బ్ర‌హ్మానందంలా ఫీల‌య్యి.. ఎట్ట‌కేల‌కు ఇదిగో ఈ టీష‌ర్టు ఐడియా అమ‌లు చేశారు. దీంతో ఎస్ ఇలాంటి ఆధార్ ప్రింటెడ్ టీష‌ర్టు  మ‌నం త‌ప్ప మ‌రే ఊరోళ్లూ వేస్కోర‌ని క్రేజీగా ఫీల‌య్యి.. ఇదిగో ఇలా త‌మ టాలెంట్ చూపించార‌న్న‌మాట‌.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్లు, ఔట‌ర్ ఐడీలు మాత్ర‌మే చూసిన జ‌నం.. ఇదిగో ఈ ఊరోళ్లు ఆధార్ లింక్డ్ టీష‌ర్టుల‌ను చూసి.. ఈ ఊరోళ్లంతా భ‌లే టాలెంటెడ్ గా ఉన్నారే.. అంటూ స‌ర‌దా కామెంట్లు చేస్తున్నారు ఈ ప‌రిస‌ర ప్రాంత వాసులు.

రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీ కొని ఎనిమిది ఏనుగులు మృతి.. అసోంలో విషాదం

 రైలు ఢీకోని ఎనిమిది ఏనుగులు మృత్యువాతపడిన విషాద ఘటన అసోంలో శుక్రవారం (డిసెంబర్ 20) తెల్లవారు జామున జరిగింది. సైరంగ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఐదు  బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో రైలు ప్రయాణీకులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాగా ఈ ఘోర ప్రమాదం నుంచి ఒక గున్న ఏనుగు సురక్షితంగా తప్పించుకుంది. ఆ గున్న ఏనుగును అటవీశాఖ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అదలా ఉంటే  ఈ ప్రమాదం గువాహ‌టికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో  జరిగింది. ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  

ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు

దేశ రాజధాని నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ముఖ్యంగా చిన్న పిల్లలు కాలుష్యం కారణంగా అనారోగ్యం పాలౌతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను కాలుష్యం బారి నుంచి కాపాడే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని మొత్తం స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న దాదాపు 38 వేల స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వీటికి అయ్యే వ్యయం పర్యావరణ సెస్ నిధుల నుంచి  ఉపయోగించనున్నట్లు తెలిపింది.  తమ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని ప్రకటించిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి కాలుష్యం బారి నుంచి విద్యార్థులను కాపాడేందుకే స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ఢిల్లీలో కాలుష్య సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన అవన్నీ త్వరలో ఫలితాన్నిస్తాయన్నారు.  

ప్రమాదవశాత్తు రైల్లోంచి పడి నవదంపతులు దుర్మరణం

కొత్తగా పెళ్లైన దంపతులు రైలు నుంచి జారి పడి దుర్మరణం పాలైన ఘటన   యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి  రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం (డిసెంబర్ 18) అర్ధరాత్రి సమయంలో జరిగింది. మృతు లను ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా   గుర్తించారు. ఇటీవలే వీరికి వివాహమైంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు.  హైదరాబాద్ నుంచి విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో  డోర్ వద్ద నిలబడిన ఈ జంట ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.  

ఎడారి దేశంలో వర్ష బీభత్సం

అతివృష్టి అనావృష్టి అంటూ వరుణుడి విషయంలో తరచూ అనుకుంటూ ఉంటాం. కురిస్తే కుండపోత వానలూ, లేకుండా ముఖం చాటేసే మబ్బులు. ఈ పరిస్థితి ఇండియాలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రైతాంగానికి బాగా అలవాటైన వాతావరణ పరిస్థితి. అయితే చినుకుకే మొహంవాచిపోయి ఉండే ఏడారి దేశంలో వర్షం బీభత్సం సృష్టించడం అంటే.. ఊహకు అందడం ఒకింత కష్టమే. అయితే ఇప్పుడు ఎడారి దేశాల్లో కూడా వరుణుడు వీరంగం ఆడుతున్నాడు.   ముఖ్యంగా యూఏఈలోని దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. రోడ్లు చెరువులను తలపించాయి. విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీచ్‌లు, పార్కులు మూసివేశారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామం. మొన్నటి వరకు భారీ వర్షాలు ఇండియాను అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటాలు, పంట ధ్వంసం సంభవించాయి.  ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు   పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు కురిశాయి. చాలా చోట్ల క్లౌడ్ బరస్ట్ జరిగింది. వరదలతో రోడ్లు కొట్టుకుపోయాయి.. ఇళ్లు, పంటలు మునిగిపోయాయి. గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. ఈ ఏడాది వర్షాల వల్ల ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండియా వంటి దేశాలలో వానలు, వరదలు సర్వసాధారణం. కానీ  అటువంటి పరిస్థితులు ఎడారి దేశాల్లో ఏర్పడటం అరుదు.  అయితే ఇప్పుడు కుండపోత వానతో  అబుదాబీ, దుబాయ్ లు అతలాకుతలమౌతున్నాయి.   ఎడాది దేశం యూఏఈలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో  అబుదాబీ, దుబాయ్‌తో పాటు పులు నగరాల్లో జనజీవనం స్తంభించిపోయి. గంటల పాటు కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపించాయి.  ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానరాకపోకలకు తీవ్ర జాప్యం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  వరద తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దని, అది ఏ నిమిషంలోనైనా ప్రమాదకరంగా మారవచ్చని షార్జా సివిల్‌ డిఫెన్స్‌ అథారిటీ  హెచ్చరించింది. దుబాయ్, అబుదాబీతో పాటు దోహా, ఖతార్‌లలోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం  చేసేశాయి. యూఏఈలో భారీ వర్షాలు దాదాపు పాతికేళ్ల రికార్డును బ్రేక్ చేశాయి.  వరదల నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక మున్సిపల్‌ సిబ్బంది.. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలానే ట్రావెల్‌ అడ్వైజరీలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కార్యాలయం సీసీఎస్ కు మార్పు

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం హదరాబాద్ సీపీ నేతృత్వంతో  మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొనసాగిన  సిట్ కార్యాలయాన్ని  కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ (సిసిఎస్)కు మార్చారు. శనివారం (డిసెంబర్ 20) నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యకలాపాలన్నీ సీసీఎస్ కేంద్రంగానే సాగుతాయి.   ఫోన్ ట్యాపింగ్‌  కేసులో మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.   ఈ సిట్‌ లో  రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి,   డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.   రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ కు విస్తృత అధికారాలు కల్పించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.   ఇలా ఉండగా ఈ కేసులో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కస్టోడియల్ ఎంక్వయిరీలో ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును సిసిఎస్‌కు తరలించారు. సిసిఎస్‌లో ప్రభాకర్ రావుకు ప్రత్యేక గదిని సిట్ ఏర్పాటు చేశారు.   

ఐదో టి20లో సఫారీలు చిత్తు..టి20 సిరీస్ టీమ్ ఇండియా కైవసం

దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ ను టీమ్ ఇండియా 3-1 తేడాతో కైవసం చేసుుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 19) రాత్రి జరిగిన చివరి ఐదో టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా  సఫారీలను  30 పరుగుల తేడాతో చిత్తు చేసింది.  ఈ మ్యాచ్‌లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్నీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి  231 పరుగుల భారీ స్కోరు సాధించింది. 232 పరుగులు విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 201 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. భారీ విజయలక్ష్యంతో భాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత ఆరంభాన్ని అందించాడు.   డికాక్ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా ప వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసి మంచి స్థితిలో ఉంది. ఆ తరువాత  13 పరుగులు చేసిన హండ్రిక్స్  ఔటయ్యాడు. అయితే డికాక్ దూకుడు కొనసాగించాడు. డికాక్ క్రీజ్ లో ఉన్నంత సేపూ దక్షిణాఫ్రికా లక్షాన్ని ఛేదిస్తుందనే అనిపించింది. అయితే  11వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా   డికాక్ ను కాట్ అండ్ బౌల్డ్ గా పెవిలియన్ కు పంపాడు. డీకార్   డికాక్ 35 బంతుల్లో 65 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా లయ కోల్పోయింది. బ్యాట్స్ మన్ పరుగుల కోసం అంత చలిలోనూ చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. డికాక్ ఔటైన తర్వాత   5 ఓవర్లలో ఆఫ్రికా 38 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే.. భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్ధమౌతుంది.  డివాల్డ్ బ్రెవిస్ (31) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది.  ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరే ఆరంభాన్నిచ్చారు. సంజు శాంసన్  22 బంతుల్లో 37 పరుగులు, . అభిషేక్ శర్మ 21 బంతుల్లో34 పరుగులు చేశాడు. ఆ తరువాత తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యాలు పరుగుల సునామీ సృష్టించారు. ముఖ్యంగా హార్ధిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగి పాతిక బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  అలాగే తిలక్ వర్మ  42 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, హర్షదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్ధిక్ పాండ్యాకు దక్కింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీ పర్యటలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతి తాజా రాజకీయ పరిణామలపై చర్చించారు. ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందనను చంద్రబాబు, అమిత్ షాకి వివరించారు.  కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయిన సీఎం అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని, హైవే నెట్‌వర్క్‌లతో రాజధానిని కనెక్ట్ చేయాలని కోరారు. మరోవైపు కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి  హర్దీప్ ఎస్ పూరీతో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రూ. 96,862 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటి అయిన నెల్లూరు జిల్లాలోని బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి  మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి సమావేశం  అయ్యారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు అవశ్యకతను ఆయన కు వివరించారు. సవరించిన డీపీఆర్ లను ఆమోదించాలని కోరారు. 

భార్యపైన తనకున్న ప్రేమను చాటుకున్న ఓ రైతు

  రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలో ఉన్న చిలుకూరు గ్రామంలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 89 ఏళ్ల వయసులోనూ తన జీవిత సహచరిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతూ ఓ రైతు తన భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన దృశ్యాన్ని  చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు. కళ్లెం నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులు... వీరు చిలుకూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు.  గత సంవత్సరం క్రితం భార్య లక్ష్మి మరణించింది. దీంతో భార్య లక్ష్మి ప్రధమ వర్ధంతి సందర్భంగా కళ్లెం నర్సింహా రెడ్డి, తన వ్యవసాయ క్షేత్రంలో భార్య లక్ష్మీ విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూతుళ్లు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం ఆమె పక్కనే తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ముప్పై సంవత్సరాల పాటు అమెరికాలో వ్యవసాయం చేస్తూ ఆధునిక, ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అమలు చేసిన నర్సింహా రెడ్డి, ఆ కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా అవార్డును కూడా అందు కున్నారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన చిలుకూరులో స్థిరపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న భార్య లక్ష్మీ మరణించడంతో నర్సింహా రెడ్డి ఒంటరిగా మిగిలిపోయారు. అయితే ఆమె జ్ఞాపకాలను మరచి పోకుండా ఉండేందుకు, జీవితాంతం తనతోనే ఆమె ఉంటుందనే భావనతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. “ఆమె ఒంటరిగా ఉండ కూడదు… నేను ఆమెకు తోడుగా ఉంటాను” అన్న భావంతోనే భార్య పక్కనే తన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్లు ఆయన తెలిపారు. జీవిత భాగస్వామి పై నిస్వార్థమైన అనురా గాన్ని చూపిస్తున్న రైతును చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు.చిలుకూరులో జరిగిన ఈ ఘటన, ప్రేమకు వయస్సుతో పని లేదని మరోసారి నిరూపించింది.

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

  తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A29 టిటిడి అధికారి సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్యం 2017–18 మరియు 2020 నుంచి 2023 వరకు టిటిడి కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన సమయంలో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పీపీ వివరించారు. డెయిరీ ప్లాంట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేయకుండానే అనుకూల నివేదికలు ఇచ్చి, అర్హత లేని సంస్థలైన భోలేబాబా డైరీ, వైష్ణవీ డైరీ, మలగంగా మిల్క్ అగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి తిరుమలకు నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించినట్టు వాదించారు. దీనికి ప్రతిఫలంగా నిందితుడు సుబ్రహ్మణ్యం వెండి ప్లేట్లు, శాంసంగ్ మొబైల్ ఫోన్‌తో పాటు రూ.3.50 లక్షల లంచం తీసుకున్నట్టు సిట్ గుర్తించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, అప్పన్నతో కలిసి కుట్ర చేసిన తీరును స్పష్టంగా చూపించే సాక్ష్యాలు ఉన్నాయని పీపీ జయశేఖర్ తెలిపారు. అలాగే వైవి సుబ్బారెడ్డి పీఏ అప్పన్న ఒత్తిడితోనే సుబ్రహ్మణ్యం ఈ అక్రమాలకు పాల్పడ్డాడని కోర్టులో వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ న్యాయమూర్తి, నిందితుడిపై ఉన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంటూ సుబ్రహ్మణ్యం బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించారు.