Actress Kalpana dies in Hyderabad

Kalpana- A popular actress of South India is no more. The national award winning actress Kalapana has departed from the stage this morning. She was in admitted to Apollo hospitals in Hyderabad where she was declared to be dead of heart attack. She was in the city for shooting the Nagarjuna movie `voopiri’. Kalapana has been a native to the Malayalam film industry where she has acted in more than hundred movies. Coming from a family of actors, her sisters Urvashi and Kalaranjini were also renowned actress of south India. With straight movies such as `Prema’ and dubbed ones like `Sati Leelavati`… Kalapna is no stranger to the Telugu audience. From being a heroine to a comedian, Kalpana has taken every role that gives an opportunity to prove her. She has won the national award for Best Supporting Actress for her Malayalam movie Thanichalla Njan in the year 2012. While the critics were expecting her to give more of such acclaimed performances, Kalpana took her last breath at the age of just 51.

రాయలసీమ లిఫ్ట్‌ను జగన్, కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు : సోమిరెడ్డి

  రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో లాలూచీ పడి జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎం కాగా, ఇక్కడ ఏపీలో జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని గుర్తు చేశారు. 2020 నుంచి 2024 వరకు దాదాపు నాలుగేళ్లపాటు ఇద్దరూ సీఎంలుగా కొనసాగినప్పటికీ ఎన్జీటీ స్టే కొనసాగడమే వీరి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడైనా ఎన్జీటీ స్టే విధించిందా? పనులు ఆపిందా? పెనాల్టీ వేసిందా? అని ప్రశ్నించారు. లిఫ్ట్ పనులే ప్రారంభించకుండా వందల కోట్ల రూపాయలు దోచుకునేందుకు కేవలం మట్టి పనులకే పరిమితమయ్యారని విమర్శించారు. మట్టి పనుల బిల్లులు చేసుకోవడంలో ఎన్జీటీ స్టే అడ్డురాలేదని, కానీ అసలు లిఫ్ట్ నిర్మాణానికే స్టే అడ్డువచ్చినట్లుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇంత బహిరంగంగా రాయలసీమను కేసీఆర్‌కు తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెప్పే సినిమా కథలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలంతా నిజాన్ని అర్థం చేసుకున్నారని, వైసీపీ నాయకులు నోర్లు అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు.

రాయలసీమలో ఫ్యాక్షనిజానికి కారణం...మంగంపేట గనులేనా?

  తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో మంగంపేట గనుల అంశంపై జామీన్ రైతు, ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ప్యాక్షనిజానికి ప్రధాన మూలం మంగమ్మపేట గనులేనని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ ప్రజలకు నిజంగా లాభమా, లేక సీమ పేరుతో కొద్దిమందికే లాభమా అన్న ప్రశ్నను లేవనెత్తారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనింగ్ వ్యాపారం చేసిన విషయం, ఆయన తండ్రి రాజారెడ్డి నేర సామ్రాజ్యం గనుల నుంచే మొదలైందని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఒక ప్రభుత్వం చేసిన తప్పులను తర్వాతి ప్రభుత్వం కాపాడుతుందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను వచ్చే ప్రభుత్వం రక్షించే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. వ్యవస్థ మొత్తం అవినీతి చక్రంలో చిక్కుకుపోయిందన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగి వద్ద సుమారు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు బయటపడటం పాలనలో ఉన్న అవినీతికి నిదర్శనమని డోలేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 15) రాత్రి 7 గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి.  

ద‌గ్గుపాటికి...వివాదాలు ప‌రిపాటి?

  పండ‌గ పూట నారా వారి కుటుంబ‌మంతా నారావారి ప‌ల్లెలో సంబ‌రాల్లో మునిగి తేలుతుంటే.. అనంత  ఎమ్మెల్యే వివాదం ఒక‌టి పండ‌గ స్పెష‌ల్ గా తెర‌పైకి వ‌చ్చింది. అనంత అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ రాన్రాను వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఒకే సారి రెండు ఆరోప‌ణ‌లు. ఒక‌టి నంబూరి వైన్స్ య‌జ‌మానిని డ‌బ్బు కోసం ప‌లు మార్లు ఫోన్లు చేసి బెదిరించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆయ‌న వైన్స్ ని కూడా త‌గ‌ల‌బెట్టించారు.  నంబూరి న‌ల‌భై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. త‌న‌లాంటి టీడీపీ వారి మీదే ద‌గ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధార‌ణ మైన వారి  ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న విధం. ఇక ఇదే ద‌గ్గుపాటి పై రాష్ట్ర లింగాయ‌త్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయిన  స్వ‌ప్న అనే మ‌హిళ త‌న  భూమి క‌బ్జా చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌తంలో ద‌గ్గుపాటి మీద జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అన‌వ‌స‌రంగా  రెచ్చ‌గొట్టిన ఆరోప‌ణ‌లున్నాయి. ఆ ఆడియో కాల్ తో స‌హా బ‌య‌ట ప‌డి  నానా ర‌భ‌స కింద త‌యారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చ‌రించారు కూడా. అయినా స‌రే ద‌గ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక ప‌రిపాటిగా  మారింది. ఇప్ప‌టికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేల‌తో అధిష్టానానికి త‌ల బొప్పి క‌డుతోంది.  తాజాగా ద‌గ్గుపాటి  కూడా త‌యార‌య్యారు. అయితే ఇవ‌న్నీ ఆధారాలుండి బ‌య‌ట ప‌డ్డ ఎమ్మెల్యే బాగోతాల‌నీ. ఇదే రాయ‌ల‌సీమ‌లో ఒక కూట‌మి  ఎంపీని కూట‌మి  ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్ర‌మంతా పాకింది. వీరే  కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల‌ను సాక్షాత్ చంద్ర‌బాబే పిలిచి వార్నింగిచ్చారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే క‌ష్ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు కొన్ని అంచ‌నాలున్నాయి. కాబ‌ట్టి.. అధినేత చంద్ర‌బాబు వీరంద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీస్కోకుంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.

ఈటల వర్సెస్ మర్రి.. తెలంగాణలోనూ క్రెడిట్ వార్

ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్యం విషయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఒక పక్క క్రెడిట్ వార్ కొనసాగుతుండగానే.. తెలంగాణలో కూడా మరో క్రెడిట్ వార్ మొదలైంది. పొలిటికల్ గా క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి నేతల ఆరాటమే ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అయితే అడ్డగోలుగా తాను అవసరం లేదంటూ వాదించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆ ఎయిర్ పోర్టు ఘనతను తన ఖాతాలో వేసుకోవడానికి పడుతున్న తాపతయం నవ్వుల పాలౌతోంది. అది పక్కన పెడితే.. తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది. సదరు బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి బాహాబాహీదాకా వెళ్లింది. ఇదే విషయంలో ఈటల, మర్రి రాజశేఖరరెడ్డిల మధ్య వాగ్వాదం కూడా ముదిరింది. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందనుకోండి అది వేరే సంగతి.  విషయమేంటంటే మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల కు శంకుస్థాపన కార్యక్రమంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తన ఘనత అంటే తన ఘనత అంటూ ఈటల, మర్రి వాదనకు దిగారు. దీంతో శంకుస్థాపన సందర్భంగా బీజీపీ, బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.   పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా.. మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. చూడాలి మరి ఈ క్రెడిట్ వార్ లో విజయం ఎవరిదో?

స్కిల్ కేసు కొట్టివేత

సోమవారం ఉదయం, పోలవరం-నల్లమల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని, రాష్ట్ర ప్రభుత్వ చట్టపరమైన విధానానికి ఎదురుదెబ్బ తగిలిందని కోర్టు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కవిత Xలో పోస్ట్ ద్వారా ఈ పరిణామంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌తో కృష్ణా, గోదావరి జల వివాదాలను పరిష్కరించడంలో పాలక ముఖ్యమంత్రి మరోసారి తన అసమర్థతను చూపించారని ఆమె అన్నారు. నీటి హక్కులపై పొరుగు రాష్ట్రాలతో పోరాడకూడదని బహిరంగంగా చెప్పిన ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణకు దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కోర్టు ఫలితం తెలంగాణకు మరో అడ్డంకిని జోడించిందని కవిత పేర్కొన్నారు. రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్ల పోలవరం-నల్లమల సాగర్ లిఫ్ట్ ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణంపై తెలంగాణ హక్కులు బలహీనపడ్డాయి. ఈ చర్య రాష్ట్రాన్ని రక్షించడానికి బదులుగా రాష్ట్ర స్థానాన్ని దెబ్బతీసిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మరియు కొంతమంది కీలక ప్రభుత్వ సభ్యులు తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ ప్రజల నీటి హక్కులు నిరాకరించబడుతున్నాయని కవిత ఆరోపించారు. ఆ హక్కులను కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతి ఏపీ నీటి ప్రాజెక్టులపై పోరాడుతుందని ఆమె నొక్కి చెప్పారు.

కేసీఆర్ శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. విమర్శల దాడి పెంచిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లపై విమర్శల దాడి పెంచారు.  ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా నీటి పంపకాలపై జరుగుతున్న చర్యలు, వివాదాల నేపథ్యంలో రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లను  రాక్షసులుగా అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ చేసిన విమర్శలు ఇప్పటికే వేడెక్కి ఉన్న రాజకీయ వాతావారణాన్ని మరింత వేడెక్కించాయి. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ముందుకు నడవాలన్న ప్రయత్నాలు కొందరికి రుచించవన్నారు. ఈ సందర్భంగానే ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు. పురాతన కాలంలో ఈ రాక్షసులు యాగాలను, యజ్ణాలను ఆపారనీ, ఇప్పుడు ఆధునిక కాలంలో శుక్రాచార్యుడి పాత్రను కేసీఆర్, మారీచుడి పాత్రను కేటీఆర్ పోషిస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు.  ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర పురోగతి కోసం చేస్తున్న ప్రయత్నాలను రాక్షసుల్లో కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటున్నారని రేవంత్ అన్నారు.  ఫామ్‌హౌస్‌ వదిలి బయటకు రాని ఆధునిక శుక్రాచార్యుడు, అసెంబ్లీకి హాజరౌతున్న మారీచుడి ప్రభావాలకు లోను కావద్దని ప్రజలను కోరారు.  ముఖ్యంగా నీటి పంపకం వంటి సున్నితమైన అంశాలపై కేసీఆర్, కేటీఆర్ ల దుష్ట పన్నాగాలు, మాటల ప్రభావానికి లోనుకాకుండా వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ అన్నారు.  జలవివాదాల విషయంలో పొరుగు రాష్ట్రంలో చర్చల ద్వారా పరిష్కారం కోసం రేవంత్ ప్రయత్నిస్తుంటే, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ లు కోట్లాడి సాధించుకోవాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ రేవంత వారిరువురినీ శుక్రాచార్యుడు, మారీచులతో పోల్చారు.  

మేడారంలో రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే?

అతిపెద్ద గిరిజన జాతర మేడారం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కేబినెట్ భేటీ సచివాలయంలో కాకుండా మేడారంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆయన నిర్ణయం మేరకు  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  ఈ నెల 18 సాయంత్రం  మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది.  ఈ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న పురపాలక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్, వ్యూహాలపై చర్చించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో.. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై శాఖల వారీగా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.   ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఈ నెల 18 ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు  శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఆ తరువాత  సీపీఐ శతాబ్ది వేడుకల్లోనూ పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్కడ నుంచి నేరుగా మేడారంకు చేరుకుని కేబినెట్ భేటీకి అధ్యక్షత వహిస్తారు. ఆ రోజు అక్కడే బస చేసి జనవరి 19న మేడారంలో సమ్మక్క, సారలక్క అమ్మవార్ల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి హైదరాబాద్ చేరుకుంటారు. అదే రోజు రాత్రి దావోస్ పర్యటనకు బయలు దేరుతారు. 

ప‌ల్లెలో పండగ సంబరాల్లోనూ పాలనపై దృష్టే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన సొంత గ్రామం నారావారి పల్లెకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన నాలుగు రోజుల పాటు స్వగ్రామంలోనే ఉంటారు.   పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే.  అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది. అందుకే  వారు పండుగకు సొంత ఊరు వెళ్లే సమయంలో కూడా సూర్యలంక బీచ్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు  స్వదేశీ దర్శన్ 2.0 కింద  97 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.   ఈ నిధుల‌తో చేప‌ట్టిన షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులను సంక్రాంతి పండుగకు తన సొంత గ్రామం వెళ్లడానికి ముందు తన కుమారుడు, మంత్రి లోకేష్ తో   కలిసి ఏరియల్ వ్యూ చేశారు.   ప్రత్యేక హెలికాప్టర్ లో నారా వారి పల్లెకు వెడుతూ వారు సూర్యలంక బీచ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అక్కడికక్కడే అధికారులనుంచి వివరాలు అడిగి తెలుసుకుని దిశానిర్దేశం చేశారు.  ఇక పండుగ సందర్భంగా సొంత ఊరు నారావారి పల్లెలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సోమవారం (జనవరి 11) నారావారి పల్లె చేరుకున్న చంద్రబాబు మంగళవారం (జనవరి 12)  గ్రామంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో  పాల్గొన్నారు.  ఆ తరువాత  శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు.  రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభించారు.   ఆ తరువాత కూడా ఆయన కనుమ పండుగ రోజు వరకూ పండుగ సంబరాలతో పాటు పాలనా వ్యవహారాలను కూడా  నారావారి పల్లె నుంచే సాగిస్తారు.   ఇక నారావారి పల్లెలో నారా వారి కుటుంబ సంక్రాంతి సంబరాలలో నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా పాల్గొననుంది.   

బోత్ ఆర్ నాట్ సేమ్.. మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాలు సమానం కాదనీ, వెటికవి డిఫరెంట్ అని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ తరచుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను, వాటికి అయిన వ్యయాన్నీ పోలుస్తూ చంద్రబాబు సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.  అమరావతి సచివాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామనీ, ఇది ముఖ్యమంత్రి కార్యాలయం సహా, ఇందులో మంత్రులు, కార్య దర్శులు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయనీ,  మొత్తం పాలనాయంత్రాంగాన్ని ఒకే గూటి కిందకు తెస్తున్నామన్నారు. అదే తెలంగాణ సచివాలయంలో అయితే ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శుల కార్యాలయాలు మాత్రమే ఉంటాయనీ, శాఖాధిపతులు, సిబ్బంది కార్యాల యాలు వేరే చోటనుంచి పని చేస్తాయన్నారు.  అయితే అమరావతి సచివాలయం అయితే కార్పొరేషన్లు, వాటి శాఖలతో సహితంగా ఇక్కడే ఉంటా యన్నారు.   పాలనా సౌలభ్యం లక్ష్యంగా అమరావతి సచివాలయ నిర్మాణం ఉంటుందన్నారు. ఇది పాలనను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు. ఇవేమీ అవగాహన లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అజ్ణానంతో, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందుగా అమరావతి ప్రాజెక్టును పూర్తిగా అవగాహన చేసుకుని ఆ తరువాత మాట్లాడాలని సజ్జలకు సూచించారు.  ప్రపంచంలోని ఐదు టాప్ నగరాలలో ఒకటిగా అమరావతి అభివృద్ధి చేస్తున్నామన్న నారాయణ ఇక్కడ డ్రైనేజి వ్యవస్థలు, తాగునీటి పైప్ లైన్ లు, విద్యుత్ లైన్లు, టెలిఫోన్ కేబుల్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న స్పష్టమైన విజన్ తో ముందుకు సాగుతున్నదన్నారు. రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా అసెంబ్లీ సాక్షిగా ఆమోదించిన జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాట మెదలెట్టారని విమర్శించారు.  రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ ఆయన చేసిన విన్యాసాల వల్ల అమరావతిని భూములిచ్చిన రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు.  ప్రస్తుతం అమరావతి రాజధాని అభివృద్ధి పట్ల రైతులు, మహిళలూ ఆనందంగా ఉన్నారని మంత్రి నారాయణ చెప్పారు. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని నారాయణ స్పష్టం చేశారు.  

తెలంగాణ మునిసిపోల్స్ లో తెలుగుదేశం, జనసేన పొత్తు?!

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలు రాష్ట్రంలో తమ ఉనికి చాటుకోవడానికి తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఒక గొప్ప అవకాశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే తెలంగాణ మునిసిపోల్స్ లో పోటీ చేయనున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది.  ఇక ఆ ప్రకటన స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ నుంచి రావాల్సి ఉంది. జనసేన తెలంగాణ ఇన్ చార్జ్ పోటీపై ప్రకటన చేశారు. ఆయనా ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు.. రాష్ట్రంలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదనీ, ఒంటరిగానే రంగంలోకి దిగుతామని ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడి ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ  కూటమి  అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కొంత కాలం కిందట జనసేనాని పవన్ కల్యాణ్ కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలకు తెలంగాణ దిష్టి తగలడమే కారణమంటూ చేసిన వ్యాఖ్య లు. ఈ వ్యాఖ్యలను  తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ తీవ్రంగా ఖండించాయి.  అంతకు ముందు కూడా జనసేనాని పవన్ కల్యాణ్  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంపై ఎమోషనల్ గా స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో దాదాపు పది రోజులు తాను నిద్రలేని రాత్రులు గడిపాన్న ఆయన వ్యాఖ్య పట్ల కూడా తెలంగాణ సమాజంలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే  జనసేనతో పొత్తు వల్ల తెలంగాణలో నష్టం జరుగుతుందన్న భావనతోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు పొత్తునకు నో అని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇది పక్కన పెడితే.. తెలంగాణలో మరీ ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉండే జీహచ్ఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగితే కచ్చితంగా ప్రభావం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్ల ప్రభావం గణనీయంగా ఉండటం వల్ల  ఆ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన కూటమిగా పోటీలోకి దిగితే చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు.  ఇది తెలంగాణలో ఇతర ప్రాంతాలలో కూడా బలోపేతం కావడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.   ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణలో తమ పార్టీల బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదు. తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, నాయకత్వం లేకపోవడంతో ఇక్కడి ఎన్నికలలో రాష్ట్ర విభజన తరువాత పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక జనసేన పరిస్థితీ అంతే.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తెలంగాణలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ, పార్టీ పరంగా వారి సేవలను ఉపయోగించుకోవడానికి ఏమంత ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు  ఆ రెండు పార్టీలకూ కూడా మునిసిపోల్స్ ఒక అవకాశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన కొన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ, తరువాత బీజేపీకి మద్దతుగా తమ అభ్యర్థులను ఉపసంహరించుకుంది.  అలా అప్పట్లో జనసేన ఒక అవకాశాన్ని జారవిడుచుకుందని చెప్పవచ్చు.   జనసేన ఇప్పటివరకు తెలంగాణలో ఒకే ఒక ప్రధాన ఎన్నికల్లో అంటు  2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ ఎనిమిది సీట్లలో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయిన సంగతి  తెలిసిందే.  ఇక తెలంగాణాలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా క్రియాశీలం కావడానికి ప్రయత్నిస్తున్నది. కనుక ఈ రెండు పార్టీలకూ తెలంగాణ మునిసిపోల్స్ ఒక అవకాశం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలో కూటమిగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తే నిస్సందేహంగా గణనీయమైన ప్రభావం చూపుతాయనీ, ఇది భవిష్యత్ లో రాష్ట్రంలో ఈ రెండు పార్టీలూ అత్యంత క్రియాశీలంగా మారడానికి, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విధంగా బలోపేతం కావడానికి దోహదపతుందనీ అంటున్నారు.  చూడాలి మరి ఈ రెండు పార్టీల నిర్ణయం ఎలా ఉంటుందో?