ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు.. ఆధారాల్లేవ్.. రిమాండ్ కు నో అన్న ఏసీబీ కోర్టు
posted on Oct 28, 2022 7:28AM
తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో నిందితుల రిమాండ్ కు ఏసీబీ కోర్టు నో అంది. ఈ కేసులో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పోలీసులు కోరిన విధంగా ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావును బీజేపీలో చేరాల్సిందిగా.. నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజి అనే వ్యక్తులు ప్రలోభపెట్టారని.. రోహిత్ రెడ్డికి రూ.100 కోట్ల డబ్బుఇవ్వజూపారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే.
బుధవారం(అక్టోబర్ 26) రాత్రి వారిని అరెస్ట్ చేసి.. గురువారం(అక్టోబర్ 27) రాత్రి వరకు దాదాపు 24 గంటల పాటు విచారించారు. అనంతరం సరూర్‌నగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి రాజగోపాల్ నివాసానికి తీసుకెళ్లి.. ఆయన ఎదుట హాజరుపరిచారు. ఈ కేసుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ము దొరకనందున.. దీనికి అవినీతి నిరోధక చట్టం వర్తించదనీ వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు.
41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో.. నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజిని పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన నిందితులు పూజల గురించి మాట్లాడేందుకే మొయినాబాద్ గెస్ట్ హౌస్ కు వెళ్లామని స్పష్టం చేశారు. నిజానికి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు నిందితులు పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చారని ప్రచారం జరిగినా.. దానికి సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఓ కారులో రెండు బ్యాగులు లభ్యమైనప్పటికీ.. అందులో ఏమున్నాయో బయటకు చెప్పలేదు. ఇక ఈ కేసుపై టీఆర్ఎస్ నేతలెవరూ మాట్లాడకూడదని కేటీఆర్ స్పష్టం చేయడంకూడా ఈ కేసు విషయంలో టీఆర్ఎస్ బ్యాక్ పుట్ వేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.